నా భార్య మాన‌సిక రోగి…ఆమె మాట‌ల్ని న‌మ్మ‌కండి!

మాజీ మంత్రి నారాయ‌ణ త‌న‌పై మ‌ర‌ద‌లు కృష్ణ‌ప్రియ చేసిన సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ స్పందించ‌లేదు. కానీ అన్న‌కు మ‌ద్ద‌తుగా త‌మ్ముడు సుబ్ర‌హ్మ‌ణ్యం ఓ వీడియోను విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. ఈయ‌న భార్య ప్రియ‌నే…

మాజీ మంత్రి నారాయ‌ణ త‌న‌పై మ‌ర‌ద‌లు కృష్ణ‌ప్రియ చేసిన సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ స్పందించ‌లేదు. కానీ అన్న‌కు మ‌ద్ద‌తుగా త‌మ్ముడు సుబ్ర‌హ్మ‌ణ్యం ఓ వీడియోను విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. ఈయ‌న భార్య ప్రియ‌నే ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా త‌న బావ, మాజీ మంత్రి నారాయ‌ణ లైంగికంగా హింసించారంటూ ఆరోపించ‌డం రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రియ ఆరోప‌ణ‌ల‌పై నారాయ‌ణ‌, టీడీపీ నేత‌లెవ‌రూ నోరు మెద‌ప‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో ప్రియ భ‌ర్త‌, నారాయ‌ణ త‌మ్ముడైన సుబ్ర‌హ్మ‌ణ్యం స్పందించారు. త‌న భార్య కొన్నేళ్లుగా మాన‌సిక అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ప్రియ స్వ‌స్థ‌లం గుంటూరులో, అలాగే హైద‌రాబాద్ త‌దిత‌ర ప్రాంతాల్లో ఏఏ డాక్ట‌ర్ వ‌ద్ద ఎప్పుడు వైద్యం ఇప్పించారో ఆయ‌న పేప‌ర్లు చూపుతూ వివ‌రించ‌డం గ‌మ‌నార్హం. ప్రియ వీడియోల వ‌ల్ల త‌మ కుటుంబ ప‌రువుకు భంగం వాటిల్లింద‌ని ఆయ‌న అన్నారు. ప్రియ తీరు అభ్యంత‌ర‌క‌రంగా ఉంద‌న్నారు.

2023, మే నెల‌లో త‌న భార్య‌కు క్యాన్స‌ర్ ఉన్న‌ట్టు వైద్యులు నిర్ధారించార‌న్నారు. య‌శోద ఆస్ప‌త్రిలో ఆమెకు స‌ర్జ‌రీ చేశార‌ని ఆయ‌న తెలిపారు. 8 కిమో థెర‌పీలు చేయించాల‌ని వైద్యులు సూచించార‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు రెండు చేయించిన‌ట్టు ఆయ‌న వివ‌రించారు. త‌న భార్య‌కు ట్రీట్‌మెంట్ ఇప్పిస్తూ జాగ్ర‌త్త‌గా చూసుకుంటున్న‌ట్టు ప్రియ భ‌ర్త తెలిపారు. క్యాన్స‌ర్ చికిత్స కార‌ణంగా మాన‌సిక రోగానికి మందులు వాడ‌డం లేద‌న్నారు.

దీంతో ఆమె ఏదేదో మాట్లాడుతున్నార‌నే అర్థం ధ్వ‌నించేలా ఆయ‌న వివ‌రించారు. ప్రియ వీడియోల‌ను మాన‌వ‌తా దృక్ప‌థంతో ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ద్ద‌ని వేడుకోవ‌డం గ‌మ‌నార్హం. ప్రియ భ‌ర్త వివ‌ర‌ణ ఎట్లా వుందంటే.. త‌న భార్య విడుద‌ల చేసిన వీడియోల‌పై ఆగ్ర‌హించ‌వ‌ద్ద‌ని అన్న నారాయ‌ణ‌ను వేడుకున్న‌ట్టుగా వుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త‌న అన్న క్యారెక్ట‌ర్ గురించి మాట మాత్ర‌మైన అత‌ను మాట్లాడ‌క‌పోవ‌డంపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.