ప్రజాస్వామ్యం గురించి కమ్యూనిస్టు నాయకులు గొంతు చించుకుంటుంటారు. లోకానికి మాత్రం ప్రజాస్వామ్యం, ప్రజాప్రభుత్వం కావాలని వారు ఉద్యమిస్తుంటారు. కానీ తమ దగ్గరికి వచ్చే సరికి ప్రజాస్వామ్యం వద్దే వద్దంటారు. రోజూ ప్రజాస్వామ్యం, పౌరుల హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల గురించి ఆకాశమే హద్దుగా మీడియాలోనూ, బహిరంగ సభల్లోనూ సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ చెలరేగిపోతుంటారు.
సొంతానికి వచ్చే సరికి ప్రజాస్వామ్యం ఊసే లేకుండా వ్యవహరించడం నారాయణ, రామకృష్ణ గొప్పతనమని కమ్యూనిస్టు నాయకులే వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు. తాజాగా విశాఖలో సీపీఐ 27వ మహానభలు ముగిశాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కె.రామకృష్ణను మూడోసారి ఎన్నుకోవడం గమనార్హం. అలాగే రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీవీ సత్యనారాయణలను మరోసారి ఎన్నుకోవడం విశేషం.
ఇక్కడ విచిత్రం ఏమంటే నూతన రాష్ట్ర సమితి, కార్యవర్గ వివరాలను సోమవారం ప్రకటిస్తామని సీపీఐ నేతలు చెప్పడం. నిజానికి కౌన్సిలే రాష్ట్ర కార్యదర్శి, కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకుంటుంది. కానీ కౌన్సిల్ వివరాలను తర్వాత ప్రకటిస్తామని చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కౌన్సిల్‌ను మొదట ఎన్నుకుంటారు. కార్యవర్గాన్ని, కార్యవర్గ సభ్యుల్ని, కార్యదర్శిని కౌన్సిల్ ఎన్నుకోవడం పార్టీ రాజ్యాంగం. అందుకు విరుద్ధంగా సీపీఐ వ్యవహరించింది.
మరీ ముఖ్యంగా 2014 నుంచి రామకృష్ణనే కార్యదర్శిగా కొనసాగించడం ఘనత వహించిన సీపీఐ మార్క్ ప్రజాస్వామ్యానికి నిదర్శనం. మరో మూడేళ్ల పాటు ఈయనే సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగనున్నారు. సహజంగా ప్రజలు ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటూ వుంటారు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత ప్రాధాన్య అంశం.
కానీ సీపీఐ మాత్రం అందుకు విరుద్ధంగా ఏకగ్రీవమంటూ కార్యకర్తల గొంతు నొక్కుతోందనే విమర్శ సొంత పార్టీ నేతల నుంచే వస్తోంది. ప్రజాస్వామ్యం గురించి సుద్ధులు చెప్పే కమ్యూనిస్టు నేతలు …మీరెందుకు ఆచరించరనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వరు. అంతా మా ఇష్టం అనే రీతిలో నియంతృత్వంగా వ్యవహరించడం పరిపాటైంది. సీపీఐలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం వల్లే ఆ పార్టీ ప్రజాదరణ కోల్పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.