సిపిఎస్ రద్దుకు సంబంధించి ఆందోళన తారస్థాయికి చేరుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి సిపిఎస్ రద్దు కోసం ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాలు ఇప్పటికే పిలుపు ఇచ్చాయి. మరో రెండు రోజుల్లోనే అందుకు ముహూర్తం! ఈపాటికి పలువురు విజయవాడ చేరుకుంటుండవచ్చు కూడా!
గతంలో పెచ్చరిల్లిన ఉద్యోగుల ఆందోళన కట్టడి చేయడంలో సరైన చర్యలు తీసుకోలేకపోయిన వైఫల్యంతో- డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆ పదవి నుంచి లూప్ లైన్ లోకి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే! అలాంటి నేపథ్యంలో, ఈసారి సిపిఎస్ రద్దు అడుగుతున్న ఉద్యోగ సంఘాలు ఏకంగా సీఎం ఇంటిని ముట్టడిస్తామని చెప్పడంతో.. ఆ కార్యక్రమం అస్సలు విజయవంతం కాకుండా చేయడానికి పోలీసు యంత్రాంగం మొత్తం పనిచేస్తున్నది.
‘సిపిఎస్ రద్దు అనేది’ ఆచరణాత్మక దృష్టితో చూసినప్పుడు అసాధ్యమైన విషయం అని అనేకమంది భావిస్తుంటారు! ఈ విధానం గురించి తెలిసే చేరారు కదా ఇప్పుడు కొత్తగా ఆందోళన చేస్తే ఎలా? అనేది చాలామంది వాదన! అయితే ఉద్యోగ సంఘాల నుంచి దీనికి వస్తున్న జవాబు ఇంకో రకంగా ఉంటోంది! ప్రజాప్రతినిధులు ఐదేళ్లపాటు ఎంపీగా పనిచేస్తే వారికి జీవితాంతం పెన్షన్ సదుపాయం కల్పిస్తున్నారని.. అలాంటిది 30 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవలు చేసినందుకు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంలోనే చెల్లిస్తే తప్పేముందని వారు ప్రశ్నిస్తున్నారు?
ఒకరకంగా చూసినప్పుడు ఇది కూడా సబబుగానే అనిపిస్తుంది. వారి వాదనలో నిజం ఉందనిపిస్తుంది! ప్రజా ప్రతినిధులు ఐదేళ్లపాటు పదవిలో ఉండి ప్రభుత్వానికి సేవ చేస్తే వారికి జీవిత పర్యంతం పెన్షన్ సదుపాయం కల్పించడం ఏరకంగా ధర్మ సమ్మతం అవుతుంది! అర్థం కావడం లేదు పైగా ఎమ్మెల్యే స్థాయి పదవిలోకి వచ్చినవాళ్లు జరుగుబాటుకు గతిలేని నిరుపేదలు అయి ఉండే అవకాశం చాలా తక్కువ! ఆర్థికంగా బలమైన వాళ్లే అయి ఉంటారు. పదవిలో ఉండగా వారికి ఇచ్చే వేతనాలు కూడా చాలా భారీగానే ఉంటాయి. కానీ పదవి తర్వాత పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వం మీద పడే ఇలాంటి భారాన్ని పాలకులు ఏ రకంగా సమర్ధించుకుంటారో అర్థం కాని సంగతి!
నాయకుల రూపేణా ఇలా బీభత్సంగా కోట్లకు కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును వృథా చేస్తూ ఉన్నప్పుడు… అదే ప్రభుత్వం సొమ్మును మాకు కూడా ఇస్తే తప్పేముంది అనే వాదనను సిపిఎస్ రద్దు కోరుతున్న ఉద్యోగులు లేవనెత్తుతున్నారు! అయితే ప్రజాప్రతినిధుల పెన్షన్ సదుపాయాన్ని పూర్తిగా రద్దు చేస్తే.. వీరంతా శాంతిస్తారా అనేది సామాన్యుల్లో కలుగుతున్న సందేహం!
కొన్ని లక్షల మంది ఉద్యోగులకు సిపిఎస్ చాలు అని వాదిస్తున్న ప్రభుత్వం.. కొన్ని వందల మంది ప్రజాప్రతినిధులకు పెన్షన్ సదుపాయాన్ని పూర్తిగా రద్దు చేస్తే తప్పేముంది.. అనేది జనం మదిలో మెదులుతున్న ప్రశ్న! ఇప్పటినుంచి ప్రజాప్రతినిధుల పెన్షన్ను రద్దు చేయడానికి తగినట్టుగా జగన్ ప్రభుత్వం సభలో ఒక బిల్లును ప్రవేశపెడితే కనుక అది చారిత్రాత్మకం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు! మరి ఈ దిశగా జగన్ సర్కారు ఆలోచన చేస్తుందా లేదా వేచి చూడాలి!!