ఈ ఏడాది జూన్ 14న ఏపీ ప్రభుత్వానికి దిగి సంచలనం సృష్టించిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్…రెండు నెలల తర్వాత డిస్మిస్‌ను రిటర్న్ గిఫ్ట్‌గా పొందారు. విధుల నుంచి శాశ్వతంగా తప్పించడానికి సాంకేతికంగా కారణాలు వేరు. అసలు కారణం మాత్రం సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో కానిస్టేబుల్ నిరసనకు దిగడమే. కానిస్టేబుల్ డిస్మిస్ వ్యవహారం పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది.
ఈ ఏడాది జూన్ 14న సీఎం శ్రీసత్యసాయి జిల్లాలోని చెన్నేకొత్తపల్లి బహిరంగ సభలో హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లారు. సీఎం రాకను పురస్కరించుకుని అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ ప్లకార్డు చేతబూని నిరసనకు దిగారు.
“ఏపీ సీఎం జగన్ సార్.. సేవ్ ఏపీ పోలీస్. గ్రాంట్ ఎస్ఎల్ఎస్, ఏఎస్ఎల్ఎస్ ఎరియర్స్. సామాజిక న్యాయం ప్లీజ్” అంటూ ఆయన నిరసన చేపట్టారు. ఇది తీవ్ర సంచలనమైంది. దీంతో ప్రభుత్వం వెంటనే ఎస్ఎల్ఎస్లు, టీఏ బకాయిలను పోలీసుల ఖాతాల్లో జమ చేసింది. అయితే నిరసనకు దిగిన కానిస్టేబుల్‌పై ప్రభుత్వం కక్ష కట్టింది. దూరంగా డ్యూటీ వేసింది. మరోవైపు అతనికి పోలీసుల నుంచి భారీగా మద్దతు లభించింది.
అప్పట్లో అతన్ని ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తోటి ఉద్యోగులంతా అండగా నిలిచారు. కానిస్టేబుల్‌కు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అతని ఖాతాలో డబ్బు జమ చేశారు. మరికొందరు నేరుగా వెళ్లి ఆర్థిక సాయం అందించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగులు నిరసనకు దిగితే ఎలా వుంటుందో ఓ హెచ్చరిక పంపాలని భావించింది. ప్రకాశ్‌పై పాత ఫిర్యాదును అవకాశంగా తీసుకుంది.
2019, జూన్ 22న అనంతపురం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు గార్లదిన్నెకు చెందిన బి.లక్ష్మి అనే వివాహత వెళ్లారు. ఆ సమయంలో ఆమెతో ప్రకాశ్‌కు పరిచయం ఏర్పడింది. తన నుంచి రూ.10 లక్షల నగదు, 30 తులాల బంగారు ఆభరణాలు తీసుకోవడంతో పాటు చంపడానికి కూడా ప్రయత్నించాడని సదరు మహిళ ప్రకాశ్‌పై ఫిర్యాదు చేసింది. డిపార్ట్మెంట్ విచారణలో ఈ అభియోగాలు నిజమని రుజువు కావడంతో కఠిన చర్య తీసుకుంది.
ఉద్యోగం నుంచి శాశ్వతంగా తప్పిస్తున్నట్టు ఎస్పీ ఫకీరప్ప ఉత్తర్వులు ఇచ్చారు. ఇదిలా వుండగా ఈ నెల 24న ప్రకాశ్ మెడికల్ లీవ్‌పై స్వస్థలం కదిరికి వెళ్లారు. దీంతో డిస్మిస్ ఉత్తర్వులను డీపీవో క్వార్టర్స్‌లో ఉంటున్న అతని ఇంటికి అంటించారు.