సీపీఎస్ ఉద్యోగ సంఘాలు సెప్టెంబర్ 1 నిర్వహించ తలపెట్టిన సీఎం ఇంటి ముట్టడి, చలో విజయవాడ కార్యక్రమాలు ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నూతన పీఆర్సీని వ్యతిరేకిస్తూ కొన్ని నెలల క్రితం ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ ఆందోళన కార్యక్రమం ప్రభుత్వ వెన్నులో వణుకు పుట్టించింది. నిర్బంధాల్ని ఛేదించుకుని మరీ విజయవాడకు వెళ్లి ఉద్యోగులు తమ నిరసనను తెలియజేశారు.
ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు తాను అధికారంలోకి వస్తే వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తానంటే జగన్ బడాయికి పోయారు. ఇప్పుడు అదే ఆయనకు మెడకు చుట్టుకుంది. వారం అని హామీ ఇచ్చిన పెద్ద మనిషి మూడేళ్లైనా ఎందుకు మాటపై నిలబడలేక పోతున్నారని సీపీఎస్ ఉద్యోగులు నిలదీస్తున్నారు. అవగాహన లేకపోవడంతో హామీ ఇచ్చామని ఇప్పుడు ప్రభుత్వ పెద్దల సన్నాయి నొక్కులు ఉద్యోగులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.
ఈ నేపథ్యంలో హామీని నిలబెట్టుకోవాల్సిందే అని ఉద్యమ బాట పట్టారు. ఉద్యోగ సంఘాలు సెప్టెంబరు 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ…తమ నిరసనను భారీ ఎత్తున తెలపాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో సీపీఎస్ రద్దు, పాత పింఛన్ విధానం అమలు డిమాండ్లతో సీఎం ఇంటి ముట్టడికి ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం, అలాగే చలో విజయవాడకు ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఉద్యోగుల ఉద్యమాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులపై వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం నిఘా పెట్టింది. ఉద్యోగుల హోదా, ఇంటి చిరునామా, సెల్ నెంబర్ తదితర వివరాలను వెంటనే పంపాలని వాలంటీర్లకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో తమ పరిధిలోని ఉద్యోగుల వివరాలను ఉన్నతాధికారులకు అందించే పనిలో వాలంటీర్లు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ అణిచివేత ధోరణిపై ఉద్యోగులు మండిపడుతున్నారు.