కనీసం ఎన్నికల్లో పోటీ చేస్తామన్న భరోసా ఉంటే.. ఇప్పటినుంచే జనాల్లో తిరగొచ్చు. కాస్తో కూస్తో డబ్బు ఖర్చు చేయొచ్చు. యూత్ అసోసియేషన్లని, సోషల్ మీడియా టీమ్స్ ని మెయింటెన్ చేయొచ్చు. కానీ జనసేన నాయకుల పరిస్థితి అలా లేదు.
రెండేళ్ల ముందుగానే పొత్తులపై పవన్ క్లారిటీ ఇచ్చారు. ఏ సీటు, ఎక్కడ, ఎవరికి పోతుందో తెలియదు. ఇప్పటినుంచి ఆవేశ పడితే అప్పటికి అప్పనంగా మరో నాయకుడికి త్యాగం చేయాల్సి వస్తుంది. పోనీ ఖర్చులైనా గిట్టుబాటవుతాయనుకుంటే.. ఆయన దయ, వీరి ప్రాప్తం. అందుకే జనసైన్యంలో నీరసం వచ్చేసింది. ఎవ్వరూ బయటకు రావడం లేదు.
త్యాగం ఎవరు చేయాలి..? ఎందుకు చేయాలి..?
రండి, సైన్యం సిద్ధం కండి, కత్తి, డాలు సమకూర్చుకోండి అంటూ ఊదరగొడుతుంటారు పవన్ కల్యాణ్. తీరా యుద్ధానికి సిద్ధమయ్యే టైమ్ లో సంధి చేసుకుందామా అంటారు. ఆ సంధి ప్రయత్నాలతో సైనికులకు లాభం ఉండదు. కేవలం సేనాని మాత్రమే లాభపడతారు.
సైనికుల కసరత్తులు, త్యాగం అన్నీ వృథా అన్నమాట. ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఈసారి కూడా ఇదే జరుగుతుందని ఇప్పటికే హింట్ ఇచ్చారు జనసేనాని. రెండేళ్ల ముందుగానే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చనంటూ.. జనసైనికుల ఆశలపై నీళ్లు చల్లారు.
ఒంటరిగా పోటీ చేస్తే ఏ పార్టీ దమ్ము ఎంతుందో తేలిపోతుంది. కనీసం నాయకులైనా స్థానికంగా గుర్తింపు తెచ్చుకుంటారు. విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు మానేసి వచ్చినవాళ్లయినా ఇక్కడ ఏదో ప్రయత్నం చేస్తున్నాంలే అని సరిపెట్టుకుంటారు.
ఎన్నికల వరకు ఎగిరెగిరి పడి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు చేసి, కేసులు పెట్టించుకుని.. మిగతా పార్టీలవారికి వైరి వర్గంగా మారి.. ఆ తర్వాత ఎవరో ఒకరి పక్కన సైడ్ క్యారెక్టర్ గా నిలబడాలంటే ఎవరికి మాత్రం ఇష్టముంటుంది.
జనసేన నాయకులకు ప్రతి ఎన్నికల్లో ఇది తప్పని పరిస్థితి. 2019లో సింగిల్ గా పోటీ అన్నారే కానీ.. పవన్ ప్రచారాన్ని కూడా గాలికొదిలేశారు. కేవలం తన రెండు నియోజకవర్గాలపైనే ఫోకస్ పెట్టారు. చివరకు అవికూడా పోయాయనుకోండి. మిగతా చోట్ల ఓడిపోయిన నాయకులంతా అప్పటినుంచి కసిగా పనిచేస్తున్నారు. కనీసం 2024లో అయినా గెలుపుకి దగ్గరగా వస్తామనే ఆశతో ఉన్నారు. అలాంటి వారంతా ఇప్పుడు టికెట్ దక్కుతుందో లేదో అనే డైలమాలో పడ్డారు.
పవన్ వ్యాఖ్యలతో జనసేనలో ఒకరకంగా నీరసం వచ్చేసింది. పోనీలే రెండేళ్ల ముందే హింట్ ఇచ్చాడు అని సరిపెట్టుకున్న కొంతమంది మాత్రం ఇప్పటినుంచే అన్నీ సర్దుకుంటున్నారు. ఇదీ ఇప్పుడు ఏపీలో జనసేన పరిస్థితి.