భారత రాష్ట్ర సమితి అతి కష్టం మీద 39 సీట్లలో మాత్రమే గెలుపొందింది. ఆ బలం కూడా ఇప్పుడు 33 కు పడిపోయింది. ఖాళీ అయిన ఒక సీటును ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దక్కించుకుంటే, ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించేశారు. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి, అధికార పార్టీ గొడుగు కిందకు చేరడానికి సిద్ధపడుతున్నారో ఎవరికీ అంచనా లేదు.
ఇలాంటి నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం అనేది భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అతి పెద్ద ప్రయాసగా మారుతోంది. ఆయన పలువురు ఎమ్మెల్యేలతో తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని పార్టీ భవిష్యత్తు గురించి వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.
ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూడకుండా ఉండేందుకు ఆయన కష్టపడుతున్నారు. గ్రేటర్లో ఎన్నికల సమయంలో ఒక సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ గులాబీ ఎమ్మెల్యేలను ఫిరాయింప చేసి తమతో కలుపుకోవడం పై దృష్టి పెడుతోంది. కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు గాని ఆయన అందిస్తున్న భరోసా గులాబీ ఎమ్మెల్యేలను కట్టు తప్పకుండా పార్టీలోనే ఉంచుతుందా లేదా అనే వ్యవహారం సందేహాస్పదమే.
గులాబీ పార్టీ భవిష్యత్తు మీద నిజానికి పార్లమెంటు ఎన్నికలకు పూర్వమే పార్టీ నాయకులకు విశ్వాసం సడలిపోయిన సంగతి స్పష్టంగా కనిపించింది. ఆరూరి రమేష్ పార్టీ మారుతారని వార్తలు వచ్చినప్పుడు, ప్రత్యేకంగా ఎర్రబెల్లి దయాకరరావును దూతగా పంపి ఆయనను బలవంతంగా తన సముఖానికి పిలిపించుకున్నారు కేసీఆర్.
ఎంపీ టికెట్ ఇస్తామని, పార్టీలో ఉండాలని ఆఫర్ పెట్టారు. టికెట్ తనకు అక్కర్లేదని చెప్పిన ఆరూరి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రెండో రోజు భారతీయ జనతా పార్టీలో చేరి అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆరూరి రమేష్ వద్దన్న తర్వాత కడియం శ్రీహరి కూతురు కావ్యకు కేసిఆర్ టికెట్ ప్రకటించినప్పటికీ.. ఆ తర్వాత ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ ఎంపీ టికెట్ పుచ్చుకొని నెగ్గారు.
అంటే ‘కెసిఆర్ కల్పిస్తున్న భరోసాను పార్టీ నాయకులే విశ్వసించడం లేదు’ అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు కేసీఆర్ హితోపదేశాలకు కట్టుబడి ఉంటారా? పార్టీలోనే వారిని కొనసాగేలా చేయడం సులువేనా? అనే చర్చ రాజకీయ వర్గాలలో నడుస్తోంది.