అవును. ఒక నిర్ణయం తీసుకోవాలంటే డేరింగ్ ఉండాలి. దశాబ్దాలుగా రొడ్డ కొట్టుడు విధానాలు, మూస పద్ధతిలో సాగుతున్న పాలనను కొత్త పుంతలు తొక్కించడానికి ప్రజలకు మేలు చేయడానికి వ్యవస్థను పూర్తిగా మార్చడానికి విప్లవాత్మకమైన ఆలోచనలు మదిలో ఉండాలి అలాంటివి నిండుగా జగన్ లో ఉన్నాయి కాబట్టే ఆయన సచివాలయ వ్యవస్థకు రూపుదిద్దారు, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాలన మొత్తాన్ని ప్రజల ముంగిటకు చేర్చారు.
ఇప్పటికి నాలుగు దశాబ్దాలుగా పదమూడు జిల్లాలుగా ఉన్న ఏపీలో రెట్టింపు జిల్లాలు చేసి చూపించారు. ఆంధ్రాలో మూడు విభిన్న ప్రాంతాలు ఉన్నాయి. అవి పూర్తి వెనకబాటుతనంతో కునారిల్లుతున్నాయి. దాంతో శాశ్వతంగా దాన్ని దూరం చేసేందుకు మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్ చేశారు. హైదారాబాద్ మోడల్ ఏపీకి ఏ రకంగానూ మేలు కాదని రుజువు అయిపోయినా కేంద్రీకృత అభివృద్ధికి గత పాలకులు తెర తీసి మరో మారు ఏపీలో విభజన చిచ్చు రగిల్చేలా చర్యలు తీసుకున్న నేపధ్యం నుంచి వినూత్న ఆలోచనలకు జగన్ తెర తీశారు.
అందుకే ఏ రోజూ తమ ప్రాంతాలు రాజధానికి వందలన కిలోమీటర్ల దూరంలోనే ఉంటూ విసిరేసినట్లుగా ఉంటున్నాయని విసుగు చెందినా నెట్టుకొస్తున్నారు ఉత్తరాంధ్రా, సీమ జనాలు, ఇపుడు రాజధానులు రెండింటిని ఆయా ప్రాంతాలకు తీసుకెళ్ళడం ద్వారా అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలు కేంద్రీకృత విధానాలకు అలవాటు పడ్డ వారికి పాత రోత పద్ధతులే మేలు అనుకునే పెత్తందారులకు అసలు గిట్టకపోవచ్చు కానీ రేపటి వెలుగుని చూడాలనుకునే వారు అంతా జై కొడతారు.
అందుకే సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు జగన్ మూడు రాజధానుల మీద కీలకమైన వ్యాఖ్యలే చేశారు. ఉత్తరాంధ్రాకు విశాఖ రూపంలో రాజధాని రావడం అంటే అది అరుదైన గొప్ప అవకాశం. ఇలాంటి అవకాశాలు ఎపుడూ కానీ రావు. వచ్చినా వాటిని అమలు చేయాలనుకునే దృఢ సంకల్పం కలిగిన జగన్ లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడం కూడా ఎపుడో కానీ జరగదు. ఇది ఉత్తరాంధ్రా సహా వెనకబడిన వారిని నవోదయం అని ఆయన అంటున్నారు.
ఇలా అందివచ్చిన అవకాశాన్ని పోరాటం చేసి అయినా నిలబెట్టుకోకపోతే మాత్రం భవిష్యత్తు తరాలు క్షమించవు అని ఆయన స్పష్టంగానే చెబుతున్నారు. ఈ విషయంలో ధర్మాన చెప్పినది అక్షరాలా నిజం. జగన్ లోకి దార్శనికత, సమ న్యాయం చేయాలనుకునే పాలకులు అరుదుగా ఉంటారు.
అందుకే అనకాపల్లిలో తాజాగా వికేంద్రీకరణ మీద జరిగిన రౌండ్ టేబిల్ సమావేశంలో ఒక రిటైర్ట్ ఉద్యోగి ఏపీకి మూడు రాజధానులు ఉండాల్సిందే అని నొక్కి చెప్పారు. రాజు మారినప్పుడలా రాజధానులు మారాలా అని వెటకారం చేసేవారికి ఆయన చెప్పిన జవాబు దిమ్మదిరిగేలా ఉంది. తప్పుడు నిర్ణయం ఒక రాజు చేస్తే మరో రాజు వచ్చి సవరించడం ఎలా తప్పు అవుతుంది అని ఆయన నిగ్గదీశారు.
ఇవన్నీ ఆలోచన చేసినపుడు జగన్ లాంటి పాలకుడు అరుదైన అవకాశం ఇచ్చారనే భావించి దక్కించుకునేందుకు అంతా ప్రయత్నం చేయాల్సిందే.