అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు మోసానికి సరిగ్గా నేటికి ఏడేళ్లు. 2015, అక్టోబర్ 22న ఉద్ధండరాయునిపాలెంలో అమరావతి రాజధానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరైనప్పటికీ, నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాత్రం దూరంగా ఉండడం గమనార్హం. దీన్నిబట్టి అమరావతి రాజధానికి జగన్ అనుకూలత ఏంటో అర్థం చేసుకోవచ్చు.
వినేవాళ్లుంటే చంద్రబాబు ఎన్ని మాయమాటలైనా చెబుతారు. రకరకాల సెంటిమెంట్స్‌ను తెరపైకి తెచ్చి, జిమ్మిక్కులు చేయడంలో చంద్రబాబుకు సాటి రారెవరూ. అమరావతి రాజధానికి శంకుస్థాపన రోజే, ఆ పేరుతో తలపెట్టిన రెండో దశ పాదయాత్ర ఆగిపోవడంపై సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. రాజధాని శంకుస్థాపనకు ఏడేళ్లు పూర్తి అయిన సందర్భంగా చంద్రబాబు స్పందించడం విశేషం.
తుగ్లక్‌ను తలపించే జగన్ పాలనలో అమరావతి ప్రాణం పోయిందని వాపోయారు. అయితే మళ్లీ ఊపిరి పోసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదుకోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరుతుందని ఆయన చెప్పుకొచ్చారు. న్యాయం, త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే నిలుస్తుందని, గెలుస్తుందని, ఇదే ఫైనల్ అని తనదైన మార్క్ ప్రకటన చేశారు.
కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండె చప్పుడుగా అమరావతి నిలుస్తుందని ఆనాడు ఆకాంక్షించా మని ఆయన గుర్తు చేశారు. రాజధానిని రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో కాకుండా దొనకొండలో పెట్టాలని, లేదంటే ఎప్పటికైనా వేర్పాటువాద ఉద్యమాలు పుట్టుకొస్తామని మాజీ సీఎస్ జయభారత్‌రెడ్డి, మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాలరావు నాటి సీఎం చంద్రబాబుకు చిలక్కు చెప్పినట్టు చెప్పిన సంగతిని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తాజాగా వెల్లడించిన సంగతి తెలిసిందే. రాజధానిపై తాజా గందరగోళానికి చంద్రబాబు అనుసరించిన విధానాలే కారణమని ఆయన కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.
కేవలం తన పార్టీ, ప్రభుత్వ అభిప్రాయాల్ని రాష్ట్రంపై బలవంతంగా రుద్ధడం వల్లే అమరావతికి ఇవాళ ఈ దుస్థితి ఎదురైందన్నది నిజం. నాడు సీఎం హోదాలో చంద్రబాబు చేసిన మాయాజాలం అంతాఇంతా కాదు. అమరావతి శంకుస్థాపనకు ప్రతి ఊరు, పుణ్యక్షేత్రాలు, నదుల నుంచి మట్టి, నీరు తీసుకురావాలని చంద్రబాబు సెంటిమెంట్ రగిల్చారు. తెలంగాణలోని యాదగిరిగుట్ట, వేములవాడ, బాసర తదితర హిందూ పుణ్యక్షేత్రాలతో పాటు మెదక్ చర్చి, మక్కా మసీదు నుంచి కూడా నీరు, మట్టి సేకరించి తీసుకురావాలని చంద్రబాబు ఆదేశించారు. చంద్రబాబు పిలుపు అందుకుని ప్రధాని మోదీ సైతం గంగ, యమున నదీజలాలను తీసుకొచ్చి, వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేకపూజలు నిర్వహించారు.
మరెందుకు అమరావతి రాజధానికి ఇబ్బందులు వచ్చాయో చంద్రబాబు చెప్పగలరా? రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ఆకాంక్షలు, ఆశయాల్ని పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల వచ్చిన చిక్కులే ఇవన్నీ. తాజా పరిణాల నేపథ్యంలో గుణపాఠాలు నేర్చుకోకుండా, ఇంకా అమరావతే గెలుస్తుందని చెప్పడం వంచించడం కాదా? అమరావతికి ఊడిగం చేయడానికి మిగిలిన ప్రాంతాలు సిద్ధంగా లేవని చంద్రబాబు గ్రహించి తప్పులకు ప్రాయశ్చితం చేసుకోవడం మంచిది.