ఎలాగైనా తన పార్టీ ఉనికి కాపాడటం కోసం వైఎస్సార్టీపీ చీఫ్ వైయస్ షర్మిల గట్టిగా ప్రయత్నిస్తోంది. కాళేశ్వరం పాజెక్ట్ లో అవినీతి జరిగిందని అవినీతిపై దర్యాప్తు జరపాలని సీబీఐ, కాగ్ కు ఫిర్యాదు కూడా చేసింది. ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్, కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతి పై నిప్పులు చేరిగారు.
దేశంలోనే అతి పెద్ద స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిందని.. ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో సీఎం కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని షర్మిల విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో కేసీఆర్, మేఘా కృష్ణా రెడ్డి తోడు దొంగలైతే.. టీబీజేపీ చీఫ్ బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జీతగాళ్లని కామెంట్ చేశారు. అందుకే ఎవరూ ప్రశ్నించడం లేదన్నారు.
అవినీతి జరిగిందని పదేపదే ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకులు కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రం ప్రాజెక్ట్ అవినీతిపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో టీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని అనుకోవాల్సి వస్తుందన్నారు.
పనిలో పనిగా మునుగోడు ఎన్నికల గురించి మాట్లాడుతూ అవినీతి సొమ్ముతో ఎన్నికలు జరుగుతున్నాయని విమర్శించారు. మొత్తానికి తెలంగాణలో షర్మిల ఒకవైపు పాదయాత్రతో ప్రజలోకి వెళ్తూ, మరో వైపు ప్రభుత్వం అవినీతిపై గట్టి పొరాటనే చేస్తోంది.