మునుగోడు ఉప పోరు తెలంగాణ రాజకీయాన్ని వేడెక్కించింది. ప్రత్యేకించి ఈ ఉప ఎన్నిక వేళ నేతల రాజీనామాలు కూడా జరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకూ కేసీఆర్ ను తిట్టి బీజేపీలో చేరిన వారు ఇప్పుడు రాజీనామా చేసి తిరిగి గులాబీ పార్టీకి చేరుకుంటూ ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో నలిగిన వారు టీఆర్ఎస్ ను వీడి కమలం పార్టీలోకి చేరారు ఆ మధ్య. వారు ఇప్పుడు తిరిగి టీఆర్ఎస్ వైపు చేరుతున్నారు. అది కూడా మునుగోడు ఉప ఎన్నిక ముందు ఇలా జరగడం బీజేపీని ఇబ్బంది పెడుతోంది.
అందుకు విరుగుడుగా కమలం పార్టీ గట్టి సవాళ్లను చేస్తోంది. ఇప్పుడు గులాబీ పార్టీ నేతల పక్కన కూర్చున్న వాళ్లలా ఆ పార్టీ నేతలు కాదంటున్నారు బీజేపీ నేతలు. ఈ విషయంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు మాట్లాడుతూ.. మునుగోడు బై పోల్ తర్వాత అసలు కథ బయటపడుతుందంటున్నారు. కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలోకి చేరతారంటూ ఈయన జోస్యం చెబుతున్నారు. ఎనిమిది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వైపుకు వస్తారంటూ రఘునందనరావు ప్రకటించుకున్నారు! ఉప ఎన్నిక అయిపోయేంత వరకూ వేచి చూడాలంటున్నారీయన!
మరి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ను వీడి బీజేపీలోకి చేరడం అంటే పెద్ద పరిణామమే. ఆ ఎమ్మెల్యేల వలస వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పడిపోదు కానీ, కేసీఆర్ కు పెద్ద కుదుపే అవుతుంది. జాతీయ రాజకీయాలు అంటున్న కేసీఆర్ కు సొంత రాష్ట్రంలో ఎమ్మెల్యేలు చేజారిపోతే అంతకన్నా ఎదురుదెబ్బ ఉండదు. అయితే ఇదంతా బీజేపీ నేతలు చెప్పినది జరిగినప్పుటికి!
మునుగోడులో బీజేపీ గెలిస్తే.. ఎవరైనా కొందరు నేతలు బీజేపీని పరిగణనలోకి తీసుకుంటారేమో! ఒకవేళ ఓడిపోతే మాత్రం బీజేపీ గ్రాఫ్ మళ్లీ పడిపోతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేను తమ పార్టీ వైపుకు చేర్చుకుని గెలిపించుకోలేదనే అపఖ్యాతిని బీజేపీ గట్టిగా ఎదుర్కొనాల్సి ఉంటుంది.