భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత భారీ ధనవ్యయం కాగల ఉప ఎన్నికగా నిలుస్తోంది మునుగోడు బైపోల్. మూడు పార్టీలు ప్రధానంగాపోటీ చేస్తూ.. వాటిల్లో విజయాన్ని రెండు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో… నోట్లు కట్టలు తెంచుకుంటున్నాయి. మునుగోడులో ఓటుకు పంచే డబ్బు అత్యంత భారీ స్థాయిలో ఉండబోతోందని స్పష్టం అవుతోంది.
స్థానిక పరిస్థితుల ప్రకారం చూస్తే.. ఒక్కో ఓటుకు ఒక్కో రాజకీయ పార్టీ పది వేల నుంచి లక్ష రూపాయల క్యాష్ ను పంపిణీ చేయవచ్చని తెలుస్తోంది. ఓటుకు వందో, వెయ్యో అనేది పాత లెక్క. ఈ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో.. ఓటు రేటు పది వేలు, 15 వేల రూపాయల వరకూ పలకవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు పంపిణీకి ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి.
ఇందుకోసం ఓటుకు నోటు పంచగల సమర్థుల ను కూడా వెదికే పనిలో పడ్డాయి పార్టీలు. ఎంత విచ్చలవిడిగా డబ్బును చిల్లాడినా.. డబ్బును మాత్రం గుట్టుగా పంచాలి. ప్రత్యేకించి ప్రత్యర్థుల కళ్లలో పడకూడదు ఈ పంపకాలు. ఎక్కడైనా ఒక్క చోట వీడియోలకు ఎక్కినా రచ్చ రచ్చ అవుతుంది. అందులోనూ.. ఏ కోటి రూపాయలో, పది కోట్ల రూపాయలో అయితే.. గుట్టు చప్పుడు కాకుండా పంచేయడం పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. మునుగోడులో వ్యవహారం వందల కోట్ల రూపాయలకు చేరింది.
ఇలాంటి నేపథ్యంలో.. సమర్థులు, నమ్మకస్తులైన వారితో డబ్బులు పంపిణీ చేయడం కూడా పార్టీలకు సరికొత్త సవాలవుతోంది. ఇందుకు సంబంధించి పార్టీలు ఇలాంటి వారిని అన్వేషిస్తున్నాయి. ఈ పనికి పూనుకునే వారికి లక్షకు పది వేల రూపాయల కమిషన్ కూడా ఆఫర్ చేస్తున్నాయి పార్టీలు. సక్సెస్ ఫుల్ గా లక్ష రూపాయలను ఓటర్లకు ముట్ట చెబితే పది వేల రూపాయల కమిషన్ దక్కినట్టే.
అయితే ఎక్కడైనా దొరికితే మాత్రం గట్టి కేసులు తప్పకపోవచ్చు. అందులోనూ ఎన్నికల కేసులు అంత తేలికగా పోయేవి కావు. డబ్బు పంపిణీ వంటి కార్యక్రమాల్లో రెడ్ హ్యాండెడ్ గానో , వీడియోల్లోనో దొరికిపోతే.. ఆ తర్వాత ప్రతి ఎన్నికలప్పుడూ ఇలాంటి వారిని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. కాబట్టి.. స్థానికంగా ఇలాంటి పనికి ముందుకు వచ్చే వారి కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి పార్టీలు.