టీడీపీతో జనసేన పొత్తుపై అధికార పార్టీ మాట్లాడుతూనే వుంది. జగన్‌ను ఓడించేందుకు ఇద్దరి మధ్య అపవిత్ర పొత్తు కుదుర్చు కుంటున్నారనే సంకేతాల్ని జనంలోకి తీసుకెళ్లేందుకు అధికార పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తోంది. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరితే కొన్ని చోట్ల వైసీపీకి నష్టమే. ఇదే సందర్భంలో ఒక్కడిని ఎదుర్కోడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఉమ్మడిగా వస్తున్నాయనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేసి, తద్వారా లబ్ధి పొందడానికి వైసీపీ పథక రచన చేస్తోంది.
జనసేనాని రాజకీయ అవగాహన లేమి… పొత్తుపై ముందస్తు ప్రకటనే నిదర్శనం. దీని వల్ల పవన్‌కల్యాణ్ జనంలో పలుచన అయ్యారు. నిజానికి పవన్‌తో చంద్రబాబుకు అవసరం ఎక్కువ. అది మరిచిపోయి, జగన్‌ను గద్దె దించడం తన లక్ష్యమన్నట్టు పవన్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. మళ్లీ గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే పొత్తు అంటూ ట్విస్ట్. ఇవేమైనా బహిరంగంగా మాట్లాడు కునే అంశాలా? ప్రత్యామ్నాయం నినాదంతో రాజకీయ తెరపైకి వచ్చి పవన్ చేస్తున్న రాజకీయాలేంటో అందరికీ తెలిసినవే.
రాజకీయాల్లో చిన్న తప్పటడుగు చాలు… భారీ మూల్యం చెల్లించడానికి. ప్రస్తుతం పవన్ అనుసరిస్తున్న రాజకీయ పంథా కూడా ఆయన్ను శాశ్వతంగా దెబ్బ తీసేలా వుంది. చంద్రబాబును నమ్మి దగ్గరైన నాయకులెవరైనా చరిత్రలో బాగుపడిన సందర్భాలు న్నాయా? అంటే… లేవనే చెప్పాలి. ఈ విషయం బాగా తెలిసి కూడా… కేవలం తన వ్యక్తిగత గెలుపు కోసం అన్నీ గాలికొదిలేసి చంద్రబాబు చంకనెక్కేందుకు పవన్ తహతహలాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో టీడీపీతో జనసేన పొత్తుపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఒంటరిగా పోటీ చేసే శక్తి లేకే పొత్తుల కోసం ఆరాటపడుతున్నట్టు పవన్ చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. పవన్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా తమకు ఇబ్బంది లేదని ఆయన చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాలే మళ్లీ జగన్‌ను సీఎం చేస్తాయని వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేయడం విశేషం.