టీడీపీతో జనసేన పొత్తు అనధికారికంగా ఖరారైంది. ఇక మూడు ముళ్లు ఒక్కటే తరువాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఇంకా పవన్‌ను పట్టుకుని దమ్ముంటే సింగిల్‌గా పోటీ చేయాలనే డిమాండ్ చేయడం వ్యర్థ ప్రయాస. ఎందుకంటే ఎన్నికలను ఎదుర్కోడానికి ఒక్కో పార్టీకి ఒక్కో పంథా వుంటుంది. పొత్తులతో సంబంధం లేకుండా ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కోవాలనేది వైసీపీ మొదటి నుంచి తీసుకున్న స్టాండ్.
ఇదే టీడీపీ విషయానికి వస్తే పొత్తులు కుదుర్చుకోవడం ఆ పార్టీ పాలసీ. రాజకీయంగా విమర్శలు చేయడానికి దమ్ముంటే సింగిల్‌గా రావాలని టీడీపీ, జనసేనలను ఉద్దేశించి వైసీపీ రెచ్చగొట్టడం చూస్తున్నాం. అయితే వైసీపీ ప్లాన్ వర్కౌట్ కావడం లేదు. ఎందుకంటే వైసీపీ అత్యంత బలీయంగా వుందని, దాన్ని ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదని ఆ రెండు పార్టీలు నమ్ముతున్నాయి. ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకున్నా ఇద్దరం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని టీడీపీ, జనసేన అధిపతులు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ అప్రమత్తం అయ్యారు.
గత ఎన్నికల అనుభవాల పీడకల వారిని ఇంకా వెంటాడుతూనే వుంది. అందుకే పవన్‌కల్యాణ్ బహిరంగంగానే ఒంటరిగా పోటీ చేసి వీరమరణం చెందలేనని తేల్చి చెప్పారు. రాజకీయంగా అవగాహన లేకపోవడం వల్ల పవన్ ఆ మాట అందరి ఎదుట చెప్పారు. కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు మాత్రం మనసులో భయాన్ని అందరి ఎదుట బయటపెట్టడం లేదు. అయితే ఆయన ఒక్క మాట మాత్రం నోరు జారి, ఆ తర్వాత మేల్కొన్నారు. తనకివే చివరి ఎన్నికలని కర్నూలు పర్యటనలో చంద్రబాబు అన్నమాట టీడీపీకి డ్యామేజీ కలిగించింది.
దీంతో ఆయన తనకు బాగా తెలిసిన యూటర్న్ తీసుకున్నారు. అబ్బే… నాకు చివరి ఎన్నికలేంటి, ఇదంతా వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం అంటూ మాట మార్చారు. ఎన్నికలంటే వ్యూహాలు, ప్రతివ్యూహాలే. ఈ నేపథ్యంలో వైసీపీ పవన్‌ను ఉద్దేశించి దమ్ము, ధైర్యం వుంటే 175 సీట్లలో పోటీ చేయాలని, సింహం సింగిల్‌గానే వస్తుందని ఏవేవో అంటున్నప్పటికీ ఆయన రెచ్చిపోవడం లేదు. రెచ్చిపోతే రాజకీయంగా చచ్చిపోతామనే వాస్తవాన్ని ఆయన గ్రహించారు. పవన్ వైఖరి తెలిసిన తర్వాత కూడా వైసీపీ తన పంథా మార్చుకోకపోతే నష్టం జగన్‌కే.
పవన్‌ను దెబ్బతీయడానికి మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ఆలోచించాలి. ఒకవేళ వైసీపీ పదేపదే దమ్ముంటే సింగిల్‌గా రావాలని టీడీపీ, జనసేనలను డిమాండ్ చేస్తే… ఉమ్మడిగా పోటీ చేస్తే ఓడిపోతామనే భయమా? అనే ప్రశ్న సహజంగానే బలంగా ముందుకొస్తుంది. దీనికి వైసీపీ నుంచి దీటైన సమాధానం ఉండదు. గతంలో వైసీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి కొంత వరకు లబ్ధి పొందామని వైసీపీ నేతలకు బాగా తెలుసు. అందుకే ఈ దఫా అలాంటి అవకాశం ఉండదనే భయం వైసీపీ నేతలను వెంటాడుతోంది. ఈ భయాల్ని పోగొట్టుకుని, శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపేందుకు వైసీపీకి ఓ కొత్త నినాదం కావాలి. దానిపై దృష్టి పెడితే మంచిది.