తనయుడు లోకేశ్ కోసం చంద్రబాబు త్యాగానికి సిద్ధపడ్డారు. ఇవాళ ‘యువగళం’ పేరుతో లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. టీడీపీకి ఇది అత్యంత ప్రాధాన్య అంశం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కుప్పానికి చేరుకుంటున్నారు. లోకేశ్ పాదయాత్ర వేడుకకు చంద్రబాబు రాకపోవడం గమనార్హం. చంద్రబాబు వెళ్లకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఈ పాదయాత్ర వేడుక గురించి చెప్పాలంటే… లోకేశ్‌కు పట్టాభిషేకమే. అలాంటి కీలక ఘట్టానికి చంద్రబాబు వెళ్లకపోవడం ఏంటనే విషయమై టీడీపీలో అంతర్గత చర్చ జరుగుతోంది. టీడీపీలో చంద్రబాబు అతి పెద్ద పర్సనాలిటీ. ఒకవేళ పాదయాత్ర ప్రారంభానికి చంద్రబాబు వెళితే, ఆయనే హైలెట్ అవుతారు. మీడియా, ఇతరత్రా దృష్టి అంతా చంద్రబాబుపైనే వుంటుంది. అప్పుడు లోకేశ్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. దీంతో చంద్రబాబు లక్ష్యం నెరవేరదు.
ఈ కారణంగా కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం తాను ఒక అడుగు వెనక్కి వేసినట్టు అర్థం చేసుకోవాల్సి వుంటుంది. పాద యాత్ర ద్వారా వేసే తప్పటడుగులను సరిదిద్దుకుంటూ, రానున్న రోజుల్లో కుమారుడు రాటుదేలుతారని చంద్రబాబు ఆశిస్తున్నారు. తప్పోఒప్పో ముందే ప్రజాక్షేత్రంలో లోకేశ్ వుండాలని, ఆ తర్వాత ఒక్కొక్కటి నేర్చుకుంటాడని చంద్రబాబు అభిలషిస్తున్నారు. ఇంతకాలం గంప కింద కోడిని మూసినట్టు, లోకేశ్‌ను బయటికి రాకుండా ఉంచడం వల్లే నష్టం జరిగిందని చంద్రబాబు భావన.
తనకు వయసు పైబడుతున్న నేపథ్యంలో ఇంకా లోకేశ్ బయటికి వస్తే ఏమవుతుందో అనే భయంతో గడిపితే మరింత నష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. దీంతో లోకేశ్‌ను బయటికి రాకుండా దాచి పెట్టడం వల్ల జరిగే నష్టమే ఎక్కువని ఆయన ఓ అభిప్రాయానికి వచ్చారు. దీంతో జనంలోకి పంపేందుకు నిర్ణయించుకున్నారు. ఎంతసేపూ టీడీపీ అంటే కేవలం తానొక్కడే అనే ముద్ర బలపడితే నష్టమే అని, వారసుడిగా లోకేశ్‌ను తెరపైకి తేవడానికి ఇదే సరైన సమయం అని ఆయన అనుకోవడమే కాదు, కార్యాచరణకు దిగారు.
లోకేశ్‌తో పాటు టీడీపీ భవిష్యత్‌ను మలుపు తిప్పే యువగళం పాదయాత్రకు తాను వెళ్లకుండా, హైదరాబాద్ నుంచే ముందుకు నడిపించాలని చంద్రబాబు నిర్ణయించుకోవడం విశేషం. చంద్రబాబు మనిషి మాత్రమే హైదరాబాద్‌లో, మనసంతా లోకేశ్ యువగళం చుట్టూ తిరుగుతోంది. చంద్రబాబు గర్వించేలా లోకేశ్ యువగళాన్ని వినిపిస్తారా? లేదా? అనేది కాలం తేల్చాల్సిన అంశం.