బీజేపీ సీనియర్ నేత, మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు టీడీపీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ గట్టి షాక్ ఇచ్చారు. ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి ఎంపీపీ పదవిని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. ఇవాళ ఎంపీపీ ఎన్నికలో బీజేపీని కాదని, తన పార్టీ అభ్యర్థుల్ని పరిటాల శ్రీరామ్ బరిలో నిలిపినట్టు ఆరోపణలున్నాయి.
ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న పరిటాల శ్రీరామ్‌ను కాదని తాడిమర్రి ఎంపీపీ, వైస్ ఎంపీపీలుగా టీడీపీ అభ్యర్థులు నిలిచే అవకాశం లేదని అంటున్నారు. తాడిమర్రి ఎంపీపీ అభ్యర్థిగా బీజేపీ ఏకైక ఎంపీటీసీ (పెద్దకోట నుంచి గెలుపొందారు) సభ్యురాలు ఆర్వేటి రత్నమ్మ ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.
అయితే ఇవాళ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎంపీపీ అభ్యర్థిగా కూచి నాగవేణి, వైస్ ఎంపీపీ అభ్యర్థిగా పద్మావతి బరిలో నిలిచారు. ఈ మండలంలో మొత్తం తొమ్మిది ఎంపీటీసీ స్థానాలున్నాయి. టీడీపీకి 5, వైసీపీకి 3, బీజేపీ ఒకటి చొప్పున బలం వుంది. టీడీపీ ఎంపీపీ, వైస్ ఎంపీపీ అభ్యర్థులకే ఆ పార్టీ మిగిలిన సభ్యులు ఓట్లు వేశారు. దీంతో టీడీపీ రెబల్స్ ఎన్నిక సులువైంది.
తాడిమర్రి ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలో మంత్రి సత్యకుమార్‌కు షాక్ ఇవ్వడంతో మిత్రపక్షాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ధర్మవరం టికెట్‌ను పరిటాల శ్రీరామ్ ఆశించారు.
అయితే కూటమి పొత్తులో భాగంగా సత్యకుమార్ ధర్మవరం టికెట్‌ను ఎగేసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఇక్కడే సత్యకుమార్, పరిటాల శ్రీరామ్ మధ్య విభేదాలు తలెత్తాయి.
చివరికి ధర్మవరం మున్సిపాలిటీకి ఏరికోరి తెచ్చుకున్న కమిషనర్‌ను శ్రీరామ్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కమిషనర్‌ను బదిలీ చేయాల్సి వచ్చింది. తాజాగా తాడిమర్రి ఎంపీపీగా టీడీపీ రెబల్స్‌ను ఎన్నుకున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందన ఏంటో చూడాలి.

జై శ్రీరామ్ ..బీజేపీ కి కూడా ఇష్టమే!