సినిమా: ఇ.ఎన్.ఇ రిపీట్
రేటింగ్: 2.75/5
తారాగణం: విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను, అనిషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్, కరుణ కుమార్, ప్రియదర్శిని రామ్, మహేష్ తదితరులు.
సంగీత దర్శకుడు: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: ఏజే ఆరోన్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
ప్రొడక్షన్ డిజైనర్స్: రాజేష్ పెంటకోట, సాలీ వైట్
నిర్మాతలు: సృజన్ యారబోలు, సందీప్ నాగిరెడ్డి
రచన, దర్శకత్వం: తరుణ్ భాస్కర్ ధాస్యం
విడుదల తేదీ: నవంబర్ 19, 2026
“ఈ నగరానికి ఏమైంది” 8 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా. దానికంటూ ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ అందులోని సీన్స్ యూట్యూబులోనూ, ఇతర రీల్స్ లోనూ ఫేమస్. ఇప్పుడు దాని సీక్వెల్ గా “ఇ.ఎన్.ఇ రిపీట్” వచ్చింది. మరి ఈసారి కూడా ఆ గ్యాంగ్ అదే స్థాయిలో నవ్వులు పూయించిందా? ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించిందా? చూద్దాం.
వివేక్ (విశ్వక్ సేన్), అతని స్నేహితులు (అభినవ్ గోమఠం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను) కలిసి తీసిన సినిమా ఫ్లాప్ కావడంతో జీవితంలో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. మరో వైపు మెడికల్ స్టూడెంట్ కీర్తన (శివాత్మిక రాజశేఖర్) తన తండ్రి (ప్రియదర్శిని రామ్)కు తెలియకుండా ఓ సినిమా బృందంలో కెమెరామెన్ దగ్గర సహాయకురాలిగా చేరుతుంది. అయితే కీర్తన తండ్రికి సినిమా రంగం అంటే అస్సలు ఇష్టం ఉండదు. వైద్య వృత్తి లాంటి కొన్ని రంగాలు మాత్రమే సమాజానికి నిజంగా ఉపయోగపడతాయని ఆయన బలంగా నమ్ముతుంటాడు.
ఇదిలా ఉండగా, ఓ పార్టీలో కీర్తనకు కాబోయే భర్త (శ్రీరామ చంద్ర)తో వివేక్, అతని స్నేహితులు గొడవపడతారు. దీంతో కోపంతో ఊగిపోయిన కీర్తన తండ్రి వాళ్లకు ఓ సవాల్ విసురుతాడు. ఆ సవాల్‌ను గెలవడంతో పాటు తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలని భావించిన వివేక్ గ్యాంగ్, ఓ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా తీయాలని నిర్ణయించుకుంటారు.
మరి ఈ విచిత్రమైన ప్రయత్నంలో వివేక్ గ్యాంగ్ విజయం సాధించిందా? వాళ్లు అనుకున్నది చేసి చూపించారా? అన్నది తెరపై చూడాల్సిందే.
కథగా కొత్తగా లేకపోయినా కథనం మాత్రం కొత్తగా ఉంది. రెగ్యులర్ టెంప్లేట్ ని, కొలతలని, ఫార్ములాని పాటించకుండా తీసుకుపోయాడు. అది కొత్తగా అనిపిస్తూనే, ఒకే పాటర్న్ లో సినిమాలు చూడడం అలవాటవడం వల్ల సినిమా చూస్తున్న ఫీల్ రాదు. ఇది పూర్తిగా లీనమైపోయే కథనం కాదు.. డైవర్ట్ అవుతూనే ఉంటాం.. కానీ కొన్ని ఎపిసోడ్స్ ఆకట్టుకుంటూ ఉంటాయి.
సినిమా స్టార్టింగ్ కాస్త స్లోగా సాగుతుంది. ఇంత సౌండ్ పొల్యూషన్ ఏంటా అనిపిస్తుంది. బీజీఎం సెట్టయ్యి.. కథలోకి వెళ్లడానికి కొంత టైమ్ పడుతుంది. తరుణ్ భాస్కర్ ఈసారి డిఫరెంట్ స్టైల్లో కథ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ కొత్తదనం తాలూకు కొన్ని సీన్స్ కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపిస్తాయి. దీంతో మొదట్లో సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ కలగదు. కానీ శివాత్మిక పాత్ర, శ్రీరామ చంద్ర ట్రాక్ ఎంటర్ అయిన తర్వాత కథ గాడిలో పడుతుంది. అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు మంచి కామెడీతో, ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది.
ఇంటర్వెల్ తర్వాత కథ థాయ్‌లాండ్‌కు షిఫ్ట్ అవుతుంది. సెకండాఫ్ మొదట్లో కాసేపు అనవసరమైన పాటతో ల్యాగ్ అనిపిస్తుంది. తర్వాత కొన్ని సీన్స్ బాగా నవ్విస్తాయి. అయితే మధ్య మధ్యలో పడి లేస్తూ ఉంటుంది నెరేటివ్. క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి పేరెంట్స్‌కు, ఇప్పటి జెన్ జీ యువతకు మధ్య ఉన్న ఆలోచనల తేడాను చూపిస్తూ ఓ మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఈ చిత్రానికి ప్రధానమైన బలం ఇద్దరు ముగ్గురు నటుల పర్ఫార్మెన్స్.
అభినవ్ గోమఠం తన కామెడీతో అదరగొట్టాడు. కొన్ని సీన్స్ లో వెన్నెల కిషోర్ ని గుర్తు చేసాడు. సినిమా ఎంటర్టైన్మెంట్కు ప్రధాన కారణం అతని క్యారెక్టరైజేషన్, కామెడీ టైమింగ్ అనే చెప్పాలి.
విశ్వక్ సేన్ ఇందులో సినిమా డైరెక్టర్ పాత్రలో కనిపించాడు. టెక్నికల్‌గా హీరో అతనే అయినప్పటికీ, సినిమా మొత్తం మీద మిగిలిన నటులు తనని డామినేట్ చేసారు.
శివాత్మిక పాత్రను ప్రేమించే వ్యక్తిగా శ్రీనాథ్ మాగంటి తన పాత్రకు న్యాయం చేశాడు. ఉప్పి పాత్రలో వెంకటేష్ కాకుమాను మాత్రం కొన్ని బెస్ట్ సీన్స్‌తో ఆకట్టుకుంటాడు. తనకు వచ్చిన అవకాశాన్ని బాగానే ఉపయోగించుకున్నాడు, నవ్వులు పూయించాడు.
ప్రియదర్శిని రామ్ తన పాత్రలో బాగానే నటించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశాల్లో తన నటన ఆకట్టుకుంటుంది.
శివాత్మిక రాజశేఖర్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. అయితే ఆమె క్యారెక్టర్‌ను ఇంకాస్త బాగా రాసి ఉంటే బాగుండేది. ప్రియదర్శిని రామ్ తమ్ముడిగా కరుణ కుమార్ తన పాత్ర పరిధి మేరకు నటించాడు.
రాబిన్ కేరెక్టర్లో నటించిన నటుడు మహేష్ కూడా గుర్తుండిపోతాడు. అనిషా అంబ్రోస్ ఓకే.
సాంకేతికంగా చూస్తే.. వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్ వీక్ అనిపిస్తుంది. చూస్తున్నా, వింటున్నా ఆకట్టుకునే సాంగ్స్ లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొంత నాయిసీగానూ, కొంత ఓకే-ఓకే గాను ఉంది.
సినిమాటోగ్రఫీని మాత్రం మెచ్చుకోవాలి. ఒకటి రెండు సింగిల్ షాట్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే, ఆకట్టుకున్నా.. కోకపోయినా.. సినిమా ప్రారంభంలో చేసిన ప్రయోగాలు కొత్తగా అనిపిస్తాయి. అయితే సెకండాఫ్‌లో కథనం నెమ్మదించడం, సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉండటం మైనస్‌గా మారాయి. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది.
పర్ఫార్మెన్సెస్ తర్వాత చెప్పుకోదగ్గది డైలాగ్ రైటింగ్.
ఒకటి రెండు మంచి లైన్స్ వినిపించాయి.
– పబ్బులో ఉరేసుకున్న వ్యక్తిని చూపించి “హీ ఈజ్ హ్యాంగింగ్ ఔట్” అనడం సందర్భోచితంగా నవ్విస్తుంది.
– “కొంతమంది 25 ఏళ్లకే చచ్చిపోతారు.. 80 ఏళ్లకి పూడుస్తామంతే” అనే లైన్ హిట్టింగ్ గా ఉంది.
– క్లైమాక్స్ లో డాక్టర్లు-సినిమావాళ్లు కాన్సెప్ట్ మీద రాసిన మాటలు జెన్-జి కి నచ్చేలా ఉన్నాయి.
– “రివెంజ్ ఆఫ్ స్నేక్స్” సీన్ కూడా నవ్విస్తుంది.
చివరిగా చెప్పాలంటే, కొన్ని సీన్స్ చూస్తుంటే ఒకే సినిమాలో భాగాల్లా కాకుండా, విడివిడిగా తీసిన షార్ట్ ఫిల్మ్స్‌లా అనిపిస్తాయి. అయినా ఓవరాల్ గా నవ్వుకోవడానికి వీలుగా ఉన్న సినిమా ఇది. కాకపోతే, మొదటి సినిమా చూసి బాగా ఎంజాయ్ చేసిన వాళ్లకు మాత్రం ఈసారి అదే ఫీల్ రాకపోవచ్చు. క్లైమాక్స్ తర్వాత వచ్చే సీన్స్‌లో అనిల్ రావిపూడి, నందినీ రెడ్డి, సందీప్ రెడ్డి వంగా తమ నిజ జీవిత పాత్రల్లో కనిపించి సర్ప్రైజ్ ఇస్తారు. ఈ సీన్స్ ఆసక్తికరంగా ఉండటంతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తాయి.
సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉండటం, అక్కడక్కడా కథనం స్లో అవ్వడం కొంత మైనస్ అయినా, కామెడీ, ఎంటర్టైన్మెంట్ మాత్రం బాగానే వర్కౌట్ అయ్యాయి. తొలి భాగంతో పోలికలు పక్కనపెట్టి, ఈ ఇ.ఎన్.ఇ-రిపీట్ ప్రేక్షకులను నవ్వించిందా అంటే అవుననే చెప్పాలి.
బాటం లైన్: నవ్వులు రిపీట్

ఐతే ఓటిటిలో చుస్తాంలే