తీర్పులు, జ‌డ్జీల‌పై పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కేఏ పాల్ అమాయ‌క చ‌క్ర‌వ‌ర్తి. ఒక‌ప్పుడు క్రిస్టియ‌న్ మ‌త ప్ర‌చార‌కుడిగా విశేష ప్రాచుర్యం పొందిన వ్య‌క్తి. రాజ‌కీయాల్లో తల‌దూర్చి , గ‌తంలో ఉన్న ప‌ర‌ప‌తిని పోగొట్టుకున్నారు. ప్ర‌జాశాంతి పార్టీ స్థాపించి అశాంతిని కొనుక్కున్న నాయ‌కుడిగా…

కేఏ పాల్ అమాయ‌క చ‌క్ర‌వ‌ర్తి. ఒక‌ప్పుడు క్రిస్టియ‌న్ మ‌త ప్ర‌చార‌కుడిగా విశేష ప్రాచుర్యం పొందిన వ్య‌క్తి. రాజ‌కీయాల్లో తల‌దూర్చి , గ‌తంలో ఉన్న ప‌ర‌ప‌తిని పోగొట్టుకున్నారు. ప్ర‌జాశాంతి పార్టీ స్థాపించి అశాంతిని కొనుక్కున్న నాయ‌కుడిగా కేఏ పాల్‌ను గుర్తిస్తారు. మ‌న‌సులో ఏదీ దాచుకోరు. ఉన్న‌వే కాదు లేనివి కూడా మాట్లాడి స‌మ‌స్య‌ల్ని నెత్తిమీదికి తెచ్చుకుంటుంటారు. 

సినిమాల్లో క‌మెడియ‌న్‌ని చూసిన‌ట్టు… రాజ‌కీయాల్లో కేఏ పాల్‌ని చూస్తున్నారు. ఆ మాట అంటే ఆయ‌న ఒప్పుకోరు. కోర్టు తీర్పులు, జ‌డ్జీల‌పై కూడా ఆయ‌న కామెంట్స్ చేస్తున్నారంటే ఆయ‌న అమాయ‌క‌త్వాన్ని అర్థం చేసుకోవాలంతే.

ఇవాళ ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. దేశాన్ని, రాష్ట్రాన్ని రాజ‌కీయ నాయ‌కులు నాశ‌నం చేశార‌ని విరుచుకుప‌డ్డారు. తెలంగాణ‌లో మ‌రోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఓ స‌ర్వే వెలుగులోకి రావ‌డంపై ఆయ‌న మండిప‌డ్డారు. టీఆర్ఎస్‌కి 36 శాతం, బీజేపీకి 30 శాతం ఓట్లు వ‌స్తాయ‌న‌డం ఉత్త దుష్ప్రచారం అని ఆయన ధ్వ‌జ‌మెత్తారు.

ప్రజాశాంతి పార్టీకి 60 శాతం ఓటు బ్యాంకు ఉందన్నారు. మ‌ళ్లీ టీఆర్ఎస్‌దే అధికారం అని ప్ర‌క‌టించిన స‌ర్వే నివేదిక‌ను కేఏ పాల్ చించేశారు. ఎన్నికల సర్వే సంస్థ అధినేత‌పై హైకోర్టులో పిటిషన్ వేస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. పిచ్చి పిచ్చి సర్వేలు చేస్తే ఊర్లలో తిరగనివ్వరని కేఏ పాల్ హెచ్చ‌రించారు.

ఈవీఎంలను బ్యాన్ చేసేందుకు పోరాటం చేస్తానన్నారు. బీజేపీకి టీఆర్ఎస్ బీ టీం అని అన్నారు. కోర్టులు ఇస్తున్న కొన్ని తీర్పులు ఊహాజనితంగా ఉన్నాయని అన్నారు. సుప్రీంకోర్టు జడ్జికి రాజ్యసభ ఇచ్చారని, పోస్టులకు, పొజిషన్లకు జడ్జీలు భయపడుతున్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.