పొత్తుపై రకరకాల ప్రచారం జరుగుతున్న వేళ జనసేనాని పవన్‌కల్యాణ్ ఎట్టకేలకు నోరు తెరిచారు. పవన్ వార్నింగ్ పొత్తు చిత్తు అవుతుందనే ప్రచారానికి ఊతం ఇచ్చేలా ఉంది. ముఖ్యంగా సీఎం పదవి విషయంలో టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్ కామెంట్స్ పవన్ మనసుని గాయపరిచాయని ఆయన మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే పొత్తులో వుంటూ, ఏ మాత్రం లెక్క చేయకుండా చంద్రబాబు తనకు తానుగా మండపేట, అరకు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించడంపై పవన్ బహిరంగంగానే ఆగ్రహాన్ని ప్రదర్శించారు.
అంతటితో ఆయన ఆగలేదు. పోటీగా తానేం తక్కువ కాదనే రీతిలో రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించి టీడీపీకి గట్టి షాక్ ఇచ్చారు. ఇదే సందర్భంలో పవన్ కీలక కామెంట్స్ చేశారు. నారా లోకేశ్ తన తండ్రే సీఎం అవుతారని అన్నప్పుడు కూడా మౌనంగా ఉన్నానని ప్రత్యేకంగా గుర్తు చేశారు. కేవలం జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతోనే నోరు తెరవలేదని పవన్ చెప్పుకొచ్చారు.
ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐదేళ్ల పాటు చంద్రబాబునాయుడే సీఎంగా ఉంటారని లోకేశ్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మాటలే పవన్‌ను హర్ట్ చేశాయి. అందుకే సీఎం పదవిపై లోకేశ్ కామెంట్స్‌ని గుర్తు పెట్టుకుని మరీ ప్రస్తావించారని అర్థం చేసుకోవచ్చు. పొత్తులో వుంటూ తమకు తాముగా సీఎం పదవిపై లోకేశ్ ఏకపక్షంగా ప్రకటించడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు.
లోకేశ్ సీఎం అభ్యర్థిని ప్రకటించగా, చంద్రబాబు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించడం జనసేన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టుగా పవన్ ఆవేదనతో ఉన్నారు. లోకేశ్, చంద్రబాబు వైఖర్లతో గాయపడిన మనసు తట్టుకోలేకే బహిరంగంగా పవన్ మాట్లాడాల్సి వచ్చిందని జనసేన నేతలు చెబుతున్నారు. పొత్తులో ఉన్నప్పుడు కేవలం టీడీపీనే రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం ధర్మం కాదని, అందుకే పవన్ వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చిందనే అభిప్రాయం జనసేన నుంచి వ్యక్తమవుతోంది.