జనసేనాని పవన్‌కల్యాణ్ రాజకీయ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. దీన్ని పసిగట్టిన టీడీపీ అప్రమత్తమైంది. తాజాగా చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని విమర్శిస్తూనే, తాను కూడా అదే బాట పట్టడం చర్చనీయాంశమైంది. బాబుతో సంబంధం లేకుండా రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని రిపబ్లిక్ డే సందర్భంగా పవన్‌కల్యాణ్ ప్రకటించారు.
దీంతో టీడీపీ ఒక్క సారిగా షాక్‌కు గురైంది. పవన్‌పై స్పందిస్తే ఒక ఇబ్బంది, స్పందించకుంటే మరో రకమైన సమస్య ఎదురవుతుందని టీడీపీ అంతర్మథనం చెందుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నియోజకవర్గ స్థాయి నేతలకు మౌఖికంగా కీలక ఆదేశాలు జారీ చేసినట్టు ఆ పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం.
జనసేనతో సంబంధం లేదని భావించి, ఒంటరిగానే బరిలో దిగేందుకు సమాయత్తం కావాలని టీడీపీ క్రియాశీలక ఆదేశాలను నేతలకు ఇవ్వడం ఆ పార్టీలో చర్చనీయాంశమవుతోంది. దీంతో జనసేనతో ఏదో తేడా కొడుతోందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. జనసేనతో పొత్తు వుంటే లాభం సంగతేమో గానీ, కనీసం 30కి తక్కువ కాకుండా అసెంబ్లీ, మూడు లోక్‌సభ సీట్లు ఇస్తే టీడీపీ భారీగా నష్టపోవాల్సి వస్తుందనే ఆవేదన ఆ పార్టీ నేతల్లో వుంది.
దీంతో జనసేనతో పొత్తు వుంటే, సీట్లను త్యాగాలు చేయాల్సి వస్తుందనే ప్రచారం జరుగుతున్న నియోజక వర్గాల్లో మాత్రం టీడీపీ ఆదేశాలు సంతోషాన్ని నింపుతున్నాయి. మిగిలిన చోట్ల ఏమవుతుందోననే భయం టీడీపీ నేతల్ని వెంటాడుతోంది. జనసేనాని పవన్‌కల్యాణ్‌తో వ్యవహారం ఎప్పటికైనా ముప్పే అని, అదేదో ఇప్పుడే తెగదెంపులైతే బాగుంటుందని, ఒంటరిగా బరిలో దిగినా అధికారంలోకి వస్తామని టీడీపీ యువ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.