కుతకుత ఉడికిపోతున్న పవన్ కల్యాణ్ !

పవన్ కల్యాణ్ ఒకవైపు తాను ఈసారి ఎన్నికల్లో ఏకంగా అధికారంలోకి వచ్చేస్తున్నాను అన్నంతగా డప్పు కొట్టుకుంటున్నారు. అదే సమయంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం మాత్రం గ్యారంటీ. ఈ రెండు పార్టీలు కలిస్తే చాలు.. జగన్…

పవన్ కల్యాణ్ ఒకవైపు తాను ఈసారి ఎన్నికల్లో ఏకంగా అధికారంలోకి వచ్చేస్తున్నాను అన్నంతగా డప్పు కొట్టుకుంటున్నారు. అదే సమయంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం మాత్రం గ్యారంటీ. ఈ రెండు పార్టీలు కలిస్తే చాలు.. జగన్ పతనం ఖరారైనట్టే అని ఆ పార్టీలకు చెందిన వారందరూ కూడా.. క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకుంటున్నారు. ఈ రకంగా ఎటుచూసినా సరే.. 2024లో పవన్ కల్యాణ్ భాగస్వామిగా ఉండే ప్రభుత్వమే ఏర్పడుతుందనే ప్రచారం నాన్-వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. అయితే వారు ఇంతగా ఆల్రెడీ అధికారంలోకి వచ్చేశాం అన్నంతగా మురిసిపోతుండగా.. పవన్ కల్యాణ్ కు తాజాగా తగిలిన షాక్ కు ఆయన కుతకుత ఉడికిపోతున్నారని సమాచారం.

జనసేన పార్టీలో కీలకంగా ఉన్న తోట చంద్రశేఖర్.. తాజాగా బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా కూడా బాధ్యతలు తీసుకోబోతున్నారు. తోట చంద్రశేఖర్ తనను వీడిపోవడం పవన్ కల్యాణ్ కు మింగుడుపడని వ్యవహారం. అందుకే ఆయన కుతకుతలాడిపోతున్నారు. 

జనసేన పార్టీకి దన్నుగా ఉన్న ఆర్థిక వనరుల్లో తోట చంద్రశేఖర్ కూడా ముఖ్యులు. రాజకీయ  అధికారం మీద వ్యామోహంతో ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వచ్చిన ఈ అధికారి.. ఇప్పటికి మూడుసార్లు దెబ్బతిన్నారు. తాను ఐఏఎస్ అధికారి కాగలిగినంత మేధవిని గనుక, ఏకంగా దేశానికి శాసనాలను తయారుచేసే పార్లమెంటులో ఉండాలని ఆయన కోరిక. 

ఎన్నికల్లో నెగ్గడానికి కాపు కార్డు కూడా విచ్చలవిడిగా వాడుకోవాలని కోరిక. ఈ సమీకరణాలతో ముందు ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా అక్కడ ఉద్ధండులతో తలపడ్డారు. ఖర్చు విషయంలో అగ్రపార్టీలకు సమానంగా సరితూగారు. కానీ ఓడిపోయారు. 2014లో ఓటమి మాత్రం రిపీట్ అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున నరసాపురం నుంచి పోటీచేసి పరాజయం చూశారు. 

నిలకడలేని ఈ మాజీ అధికారి, 2019కెల్ల పవన్ పంచన చేరారు. పవన్ కల్యాణ్ అధికారంలోకి రావడం లేదా, గెలిచిన తర్వాత అధికారంలో భాగస్వామి కావడం జరుగుతుందనే ఆశలుండడంవల్ల లోక్ సభ మీద ఆశ వదలుకుని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా పోటీచేశారు. అక్కడ కూడా దెబ్బతిన్నారు. కానీ పవన్ ఏనాటికైనా ఏపీ రాజకీయాలను శాసిస్తారనే నమ్మకంతో ఆయన మీద చాలా ఖర్చు పెడుతూ వచ్చారు. 

99 చానెల్ ను కూడా పవన్ ప్రచారం కోసం కొన్నారు. కోట్లకు కోట్ల రూపాయలు పవన్ పార్టీ కార్యక్రమాలకు, ప్రచారాలకు, సోషల్ మీడియా టీములకు, పత్రికలకు, చానెల్ కు కుమ్మరించారు. ఇన్ని చేసిన తర్వాత కూడా ఆయనకు పవన్ కల్యాణ్ మీద నమ్మకం చిక్కబడినట్టు లేదు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పవన్ కల్యాణ్ కంటె ఇప్పుడే పురుడుపోసుకున్న బిఆర్ఎస్ మేలని ఆయనకు అనిపించినట్లుంది.అందుకే బిఆర్ఎస్ తీర్థం తీసుకున్నారు. 

తోట చంద్రశేఖర్ వెళ్లిపోవడంతో.. జనసేన ఆర్థికవనరులు, ఆయువుపట్టు మీద పెద్ద దెబ్బ పడినట్టే. పైగా పవన్ కల్యాణ్ మీద అంత పెట్టుబడి పెట్టిన వాళ్లు కూడా ఆయన మీద, ఆయన గెలుపు మీద నమ్మకం కోల్పోతున్నారని ప్రజల్లోకి సంకేతాలు వెళుతులన్నాయి. అందుకే ఈ చేరిక పవన్ కు ఇరుపోటుల కింద లెక్క!