జనసేనాని పవన్‌కల్యాణ్ ఆందోళనకు గురయ్యారు. తన సామాజిక వర్గం రిజర్వేషన్ల కోసం మాజీ మంత్రి హరిరామజోగయ్య దీక్షకు దిగడంపై పవన్ కలత చెందారు. 85 ఏళ్ల వయసులో హరిరామజోగయ్య తన సామాజిక వర్గమైన కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలంటూ దీక్షకు దిగడంపై పవన్ వెంటనే రియాక్ట్ కావడం గమనార్హం.
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌పై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామజోగయ్య సోమవారం నుంచి తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లులో నిరశనకు దిగనున్నట్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే. హరిరామజోగయ్య వయసు రీత్యా నిరశనకు దిగడం మంచిది కాదనే ఉద్దేశంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పాలకొల్లులో భారీ పోలీసు బందోబస్తు చేపట్టింది. ఆదివారమే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హరిరామజోగయ్యను ఆస్పత్రికి తరలించారు. అయితే దీక్ష విరమించడానికి ఆయన ససేమిరా అన్నట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో హరిరామజోగయ్య దీక్ష, ఆరోగ్య పరిస్థితిపై పవన్‌కల్యాణ్ స్పందించారు. హరిరామజోగయ్యకు ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. కాపుల రిజర్వేషన్ల కోసం 85 ఏళ్ల వయసులో హరిరామజోగయ్య దీక్షకు దిగారన్నారు. ఆయన దీక్షపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేయడం గమనార్హం.
హరిరామజోగయ్య ఆరోగ్య పరిస్థితిపై తాను ఆందోళన చెందుతున్నట్టు పవన్ ప్రకటించారు. వెంటనే ఆయనతో ప్రభుత్వం చర్చలు జరపాలని పవన్ డిమాండ్ చేయడం విశేషం. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతుందనేందుకు ఇంత కంటే నిదర్శనం ఏం కావాలనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. హరిరామజోగయ్య ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని పవన్ గ్రహించినట్టు లేరు.
కాపుల కోసం తన లాంటి వారు నిరశనకు దిగకుండా, 85 ఏళ్లున్న హరిరామజోగయ్యను ఉసిగొల్పడం ఎంత వరకు సబబో పవన్ ఆలోచించాలనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగా హరిరామజోగయ్య ఆరోగ్యంపై జనసేనానికి ఆందోళనగా వుంటే, దీక్షకు దిగకుండా వారించి వుండాల్సింది. ఆ పని చేయకుండా సినిమాను తలపించే డ్రామాను క్రియేట్ చేయడం ఎవరి కోసం? ఎందుకోసం? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. పవన్ వినిపిస్తోందా?