జనసేనాని పవన్‌కల్యాణ్ పేరు ప్రస్తావించకుండా మాజీ మంత్రి పేర్ని నాని దెప్పి పొడిచారు. చంద్రబాబు సభల్లో వరుస దుర్ఘటనలపై పవన్‌కల్యాణ్ మౌనం పాటించడాన్ని మాజీ మంత్రి నిలదీయడం గమనార్హం. పవన్‌ను ఆయన సామాజిక వర్గానికి చెందిన ప్రత్యర్థులు విమర్శిస్తుండడం తెలిసిందే. ముఖ్యంగా మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని తదితర నేతలు పవన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభలో 8 మంది, తాజాగా గుంటూరులో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. ఒకవైపు ప్రాణాలు కోల్పోతున్నా పవన్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం ప్రత్యర్థులకు ఆయుధం ఇచ్చినట్టైంది. పవన్ మౌనాన్ని ఆసరాగా తీసుకున్న వైసీపీ నేతలు ప్రశ్నలతో విరుచుకుపడుతున్నారు.
ఇందులో భాగంగా మాజీ మంత్రి పేర్ని నాని ట్విటర్ వేదికగా పవన్ పేరు ప్రస్తావించకుండానే ఆయనకు గుచ్చుకునేలా ప్రశ్నలు సంధించారు.
“ఇప్పటం గ్రామంలోని ఇంటి ఆక్రమిత ప్రహరీ గోడలకి ఉన్నటువంటి విలువ, కందుకూరులో 8మంది, గుంటూరులో ముగ్గురు సామాన్యుల ప్రాణాలకు లేనట్టుగా నిద్ర నటించటం ఎటువంటి విలువలకు తార్కాణమో!” అని నిలదీశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటంలో ఆక్రమణల ఎపిసోడ్లో పవన్‌కల్యాణ్ ఓవరాక్షన్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ లేని ఆక్రమణలపై పవన్ అతి చేశారని, ఇప్పుడు వరుసగా ప్రాణాలు పోతున్నా పవన్ నిద్ర నటిస్తున్నారని నాని వెటకరించారు. ఈ వైఖరి ఎలాంటి విలువలకు నిదర్శనమో అంటూ వ్యంగ్యాస్త్రం సంధించడం చర్చనీయాంశమైంది.