రాజ‌కీయ ద‌ళారి

ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టానంటూ 2014లో జ‌న‌సేనానిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొత్త రాజ‌కీయం ప్ర‌స్థానం మొద‌లు పెట్టి, ప‌దేళ్లు తిరిగే స‌రికి ద‌ళారిగా మారిపోయార‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సీఎం జ‌గ‌న్‌ను ఎదుర్కోవ‌డం టీడీపీతో…

ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టానంటూ 2014లో జ‌న‌సేనానిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొత్త రాజ‌కీయం ప్ర‌స్థానం మొద‌లు పెట్టి, ప‌దేళ్లు తిరిగే స‌రికి ద‌ళారిగా మారిపోయార‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సీఎం జ‌గ‌న్‌ను ఎదుర్కోవ‌డం టీడీపీతో పాటు బీజేపీ- జ‌న‌సేన కూట‌మికి సాధ్యం కాద‌నే నిర్ణ‌యానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌చ్చారు. దీంతో పార్టీని బ‌లోపేతం చేయ‌డం ప‌క్క‌న పెట్టి, పొత్తుల భారాన్ని ప‌వ‌న్ నెత్తికెత్తుకున్నారు.

కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీని టీడీపీకి ద‌గ్గ‌ర చేసేందుకు వార‌ధిగా తాను వ్య‌వ‌హ‌రిస్తున్నాన‌ని ప‌వ‌న్ అనుకుంటున్నారు. కానీ ప‌వ‌న్‌ను ఏపీ బీజేపీ అలా చూడ‌డం లేదు. ప‌వ‌న్‌ను రాజ‌కీయ ద‌ళారిగా మాత్ర‌మే ఏపీ బీజేపీ ప‌రిగ‌ణిస్తోంది. ఈ విష‌యాన్ని బీజేపీ నేత‌ల న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌ల‌ను ప‌రిశీలిస్తే అర్థ‌మ‌వుతుంది. 

టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్ర‌తిపాద‌న‌ను త‌మ ముందు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉంచార‌ని, ఇదే విష‌యాన్ని మీడియా స‌మ‌క్షంలో కూడా చెప్పార‌ని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, అలాగే ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు చెప్పారు. పొత్తుల‌పై ప‌వ‌న్ చెప్పిన అంశాల్ని త‌మ పార్టీ జాతీయ నాయ‌క‌త్వం దృష్టికి తీసుకెళ్లామ‌ని, వాళ్ల ఆదేశానుసారం న‌డుచుకుంటామ‌ని సోము వీర్రాజు, జీవీఎల్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

టీడీపీతో ప‌వ‌న్ ముందే మాట్లాడుకుని, త‌మ‌ను ఒప్పించేందుకు ద‌ళారిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఏపీ బీజేపీ ముఖ్య నేత‌లు ఆఫ్ ది రికార్డుగా చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ప‌వ‌న్‌, చంద్ర‌బాబు మ‌ధ్య నాదెండ్ల మ‌నోహ‌ర్ ద‌ళారిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని బీజేపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. కానీ టీడీపీ, త‌మ మ‌ధ్య ప‌వ‌న్ అదే ప‌ని చేయ‌డానికి నానా తంటాలు ప‌డుతున్నార‌ని వారు ఆరోపిస్తున్నారు. 

అయితే ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ రాజ‌కీయ అప‌రిప‌క్వ‌త‌, ద‌ళారిత‌నం చూసి , ఆయ‌న‌కు పెద్ద‌గా విలువ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌నే ఉద్దేశంతో క‌నీసం కౌంట‌ర్ ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేద‌ని తెలిసింది.

ప‌వ‌న్ త‌న వ్య‌క్తిగ‌త ఇష్టాయిష్టాల్ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌పై రుద్దుతున్నార‌ని, త‌మ‌పై కూడా అలాంటి ప్ర‌యోగ‌మే చేయాల‌ని చూస్తున్నార‌ని ఏపీ బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. అయితే చంద్ర‌బాబు ప‌ల్ల‌కీ మోయాల‌నే ప‌వ‌న్ ఆదేశాల‌ను జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లే జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని, అలాంట‌ప్పుడు ఆయ‌న అభిప్రాయాల‌ను తాము ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే ప్ర‌శ్నే వుండ‌ద‌ని వారు అంటున్నారు.

చివ‌రికి ఎటూ చెల్ల‌కుండా ప‌వ‌న్ మిగిలిపోవ‌డం ఖాయ‌మ‌ని ఏపీ బీజేపీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పొత్తు లాభ‌న‌ష్టాల గురించి త‌మ‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ వివ‌రించ‌డం అంటే, ద‌ళారి వ‌స్తువుల్ని అమ్మేందుకు చెప్పే మాట‌ల‌ను గుర్తు చేస్తున్నాయ‌ని బీజేపీ నేత‌లు చుర‌క‌లు అంటిస్తున్నారు. పొత్తుల‌పై ప‌వ‌న్ పాఠాలు… ఆంజనేయుడి ఎదుట కుప్పిగంతుల్ని గుర్తు చేస్తున్నాయ‌ని బీజేపీ నేత‌లు వెట‌క‌రిస్తున్నారు.