సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా తనపై కుల ముద్ర పడాలని అనుకోరు. జనసేన స్థాపించిన పవన్‌కల్యాణ్ తనపై కాపు కులముద్ర లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. తాను అందరి వాడినే తప్ప, కేవలం కాపు సామాజిక వర్గానికే పరిమితమైన నాయకుడిని కాదని చెబుతూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో తాను కాపు నాయకుడిగా గుర్తింపు పొందడమే మంచిదనే భావజాలం ఆయనలో పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అసలు ఆయన కుల నాయకుడిగా ఎదగడానికి కారకులెవరో నిన్నటి సభ ద్వారా తెలిసింది. పవన్ ఎంతో ఇష్టపడే ప్రజాగాయకుడు గద్దర్ సలహానే ఆయన్ను కాపు నాయకుడిగా అందరూ గుర్తించేలా చేస్తోంది. ఒక చేత్తో సొంత సామాజిక వర్గం, అణగారిని వర్గాలను, మరో చేత్తో అగ్రవర్ణాలను ఆదరించాలని గద్దర్ తనకు సలహా ఇచ్చినట్టు పవన్ బహిరంగంగానే ప్రకటించారు. అందుకే పవన్‌కల్యాణ్ కాపుల సభలో పదేపదే తన సామాజిక నేపథ్యం గురించి బలంగా చెప్పే ప్రయత్నం చేశారు.
ఇందులో భాగంగా తన తల్లి, తండ్రి కులాలు, వాటి తెగల గురించి కూడా వివరాలు వెల్లడించడం గమనార్హం. తన తల్లి బలిజ, తండ్రి కాపు అని ఆయన చెప్పుకొచ్చారు. తాను కాపు-బలిజ నాయకుడిగా పవన్ తనను తాను కులావిష్కరణ చేసుకున్నారు. అగ్రవర్ణాల మీదా తనకు ద్వేషం లేదని పవన్ చెప్పడం విశేషం. ఈ వివరణలన్నీ ఎందుకిస్తున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు.
పవన్ ఎప్పుడూ అధికారంలో లేరు. ఎవరినీ వేధించే అవకాశం రాలేదు. అలాంటప్పుడు తనకు ఫలానా వాళ్లంటే ద్వేషం, కోపం లేదని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదో పవన్ వివరణ ఇచ్చి వుంటే బాగుండేది.
అసలు పాలకుడు కావాలని భావిస్తున్న నాయకులెవరైనా కులాల రొచ్చులోకి దిగుతారా? అసలే జనసేన అంటే కాపుల పార్టీగా ఓ ముద్ర వుంది. అలాగని కాపులంతా ఆ పార్టీకి వెన్నుదన్నుగా లేరు. ఆ ప్రచారంతో జనసేనకు మిగిలిన సామాజిక వర్గాలు దూరంగా వుంటున్నాయి. ఇటు సొంత సామాజక వర్గం ఆందరించక, ఇతర కులాలు అనుమానించే పరిస్థితి ఏర్పడింది. ఇవేవీ ఆలోచించకుండా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ఓటు బ్యాంక్ కలిగి ఉందన్న కారణంగా తాను కాపు, బలిజ నాయకుడినని పవన్ ప్రచారం చేసుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని గ్రహించాల్సి వుంది.
గద్దరంటే ఇష్టం కావడం, ఆయన చెప్పిన మాట వినసొంపుగా వుండడంతో దాన్ని అమలు చేయడానికే పవన్ ఆసక్తి కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. సొంత పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.