టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్‌పై రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ఎంత ప్రేమో! అసలు చిత్తూరు జిల్లాతో ఏ మాత్రం సంబంధం లేని లోకేశ్‌ను పట్టుకుని… నీది చిత్తూరు జిల్లానే, నాది చిత్తూరు జిల్లానే అనడం విశేషం. చిత్తూరు జిల్లా నేటివిటీ సర్టిఫికెట్‌ను మిథున్‌రెడ్డి ఇవ్వడం చర్చనీయాంశమైంది. “లోకేశ్‌పై మా మిథున్‌కు బాగా అభిమానం వున్నట్టుంది. అసలు చిత్తూరు జిల్లా స్థానికుడిననే భావనే లేని లోకేశ్‌ను తన ప్రాంత వాసిగా గుర్తించారు. ఆ స్పృహే లోకేశ్‌లో వుంటే…మిథున్ సవాల్‌ను స్వీకరించి చిత్తూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ముందుకొచ్చేవాడు” అంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ కార్యకర్తలు, నాయకులు అంటున్నారు.
యువగళం పాదయాత్రలో భాగంగా ప్రత్యర్థులపై నారా లోకేశ్ ఇష్టానుసారం మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తంబళ్లపల్లె నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై పరుష పదజాలంతో విమర్శలు చేశారు. లోకేశ్‌కు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు.
“లోకేశ్ కోరుకుంటున్నట్టుగా చిత్తూరు జిల్లా అభివృద్ధిపై నేను సిద్ధం. తంబళ్లపల్లెలో ఆ నియోజక వర్గ అభివృద్ధిపై చర్చిద్దాం. నిజంగా నీలో చిత్తూరు జిల్లా డీఎన్ఏ వుంటే… నీలో ఒక్క చుక్కైనా చిత్తూరు జిల్లా రక్తం వుంటే, జిల్లాలో ఏ సీటు అయినా ఎంచుకో, నీతో నేను పోటీకి సిద్ధం. నువ్వు నిజంగా చిత్తూరు జిల్లా బిడ్డ అయితే ఇక్కడ పోటీ చేయాలి. నువ్వు నా సవాల్ నుంచి తప్పించుకుని, చిత్తూరు జిల్లాలో పోటీ చేయలేనని అంటే మాత్రం భయపడినట్టే. నేను చిత్తూరు వాడినే, నువ్వు చిత్తూరు వాడివే. దమ్ముంటే నా సవాల్ స్వీకరించు” అని మిథున్‌రెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
అయితే చిత్తూరు జిల్లాకు లోకేశ్ స్థానికేతరుడనే సంగతిని రెవెన్యూ అధికారులు తేల్చేసిన సంగతి తప్పక తెలుసుకోవాలి. తంబళ్లపల్లె నియోజకవర్గంలో శనివారం సాయంత్రం 41వ రోజు పాదయాత్రను లోకేశ్ పూర్తి చేసుకున్నారు. అదే రోజు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. ఈ సందర్భంగా కురబలకోట తహశీల్దార్ భీమేశ్వరరావు తమ పరిధిలోని కంటేవారిపల్లె వద్ద లోకేశ్‌ను కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్థానికేతరులు ఉండకూడదంటూ లోకేశ్‌కు తహశీల్దార్ నోటీసులు ఇచ్చారు.
దీంతో లోకేశ్ రెండు రోజుల పాటు పాదయాత్రకు సెలవు పెట్టి, భార్య బ్రాహ్మణితో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయారు. తన స్వస్థలమైన నారావారిపల్లెకు వెళ్లి వుంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాన్ లోకల్ అని రెవెన్యూ అధికారి నోటీసులు ఇవ్వగానే, తాను హైదరాబాద్‌కు మాత్రమే లోకల్ అని గుర్చొచ్చి లోకేశ్ వెళ్లిపోయారనే విమర్శ ఉత్పన్నమవుతోంది. ఇదే నారావారిపల్లెకు లోకేశ్ వెళ్లి, ఇదే లోకల్ అని చెప్పి వుంటే… రాజకీయంగా ఆయనకు మైలేజ్ వచ్చేది. కానీ తాను చిత్తూరు జిల్లా వాసిననే స్పృహ లోకేశ్‌లో కొరవడింది. అలాంటి లోకేశ్‌ను పట్టుకుని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మన ఇద్దరిదీ చిత్తూరు జిల్లా అనడంపై సరదా కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.