ఓటర్లను రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేయడం కొత్తేమీ కాదు. చదువు సంధ్యల్లేని వారు ఓటుకు నోటు తీసుకుంటారంటే అర్థం చేసుకోవచ్చు. ఓటు విలువ తెలియకపోవడంతో ఓటును అమ్ముకున్నారని సరిపెట్టుకోవచ్చు. ప్రస్తుతం పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. విద్యావంతులు, పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటుకు రూ.5 వేలు నుంచి రూ.10 వేల వరకు తీసుకోవడాన్ని ఎలా చూడాలి?
ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంత విలువైనదో తెలిసిన బుద్ధి జీవులు కావడంతో ఓటుకు భారీగా రేటు పెంచి, ముక్కు పిండి రాజకీయ నేతల నుంచి వసూలు చేశారని భావించాలా? ఓటర్లను ప్రలోభ పెడుతున్న వారిని అడ్డుకోవడం ఒక ఎత్తైతే, విలువైన ఓటు అనే ఆయుధాన్ని అమ్ముకుంటున్న ఉపాధ్యాయులను ఏమనాలి? ఇలాంటి వారికి కదా హితవు చెప్పాల్సింది? ఆ పని వామపక్ష నాయకులు ఎందుకు చేయడం లేదు?
ప్రలోభ పెడుతున్న వారు సమాజానికి హానికరమైతే, ఇదే సమయంలో అందుకు సహకరిస్తున్న ఉపాధ్యాయులు, విద్యావంతులు కూడా నేరస్తులే కదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఓటుకు నోటు ఇవ్వకపోతే అసలు పోలింగ్ కేంద్రాలకు కూడా వెళ్లని విద్యావంతులు, ఉపాధ్యాయులు ఎంతో మంది ఉన్నారు. అంతేకాదు, తమకు ఇన్ని ఓట్లు ఉన్నాయని, ప్రతిపక్ష పార్టీల నేతలు ఇంత సొమ్ము ఇచ్చారని, అంతకంటే రెండురెట్లో, మూడు రెట్లో ఎక్కువ ఇస్తే మీకే ఓట్లు వేస్తామని బేరాలు ఆడిన, ఆడుతున్న చదువరులు, గురువులు ఉన్నారంటే, ఆశ్చర్యపోనవసరం లేదు.
ఎన్నికలు ఖరీదయ్యాయి. సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లకు, పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లకు చాలా తేడా వుంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు అమ్ముకుంటారంటే, వారికి దాని విలువ తెలియదని అర్థం చేసుకోవచ్చు. కానీ ఓటు విలువ బాగా తెలిసిన విద్యావంతులు, ఉపాధ్యాయులే ఓట్లను మార్కెట్‌లో వస్తువుల్లా అమ్ముకోడాన్ని సమర్థించలేం. ఓటర్లలో మార్పు వచ్చి, తాము ఓటుకు నోటు తీసుకునే ప్రశ్నే లేదంటే, రాజకీయ నాయకులు మాత్రం ఎందుకు ఇస్తారు?
ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రహసనంగా మారడానికి ఓటర్లు కూడా తమ వంతు పాత్రను విజయవంతంగా పోషిస్తున్నారని విమర్శించక తప్పదు. ఓటర్లలో మార్పు వస్తే… సేవా దృక్పథం ఉన్న వారు ప్రజాప్రతినిధులవుతారు. అలాంటి వారి వల్ల సమాజానికి ఎంతోకొంత ప్రయోజనం వుంటుంది. అంతే తప్ప, ప్రలోభాలకు గురి అవుతున్న వారిని విస్మరించి, ప్రలోభ పెడుతున్న వారిని విమర్శిస్తే లాభం వుండదు. ఎందుకంటే ప్రలోభాలకు గురి అవుతున్న ఓటర్లు అమాయకులేం కాదని సంగతిని విస్మరించొద్దు.