‘మోడీ, అమిత్ షా నాకు చాలా సన్నిహితమిత్రులు’ అని తరచుగా గప్పాలు కొట్టుకుంటూ ఉండే పవన్ కల్యాణ్.. ఆ మిత్రుల ద్వారా సాధించింది ఏమిటి? కేంద్రంతో మాట్లాడి విశాఖ ఉక్కు ప్రెవేటీకరణను ఆపేస్తానని ప్రల్లదనాలు పలికిన ఈ పెద్దమనిషి ఏమైపోయాడు? ప్రత్యేకహోదా సాధించి తెస్తానని వేసిన రంకెలు ఏమయ్యాయి? మోడీని అడ్డు పెట్టుకుని పవన్ కల్యాణ్ ఎప్పుడూ మాటలు చెప్పడానికి మాత్రమే పరిమితం అవుతూ ఉంటారు. ఇప్పుడు ఎన్నికల సీజను వచ్చేసరికి.. మోడీని అడ్డు పెట్టుకుని మళ్లీ ఒక అబద్ధాల దొంతరను తన అమ్ములపొదిలోంచి ఆయన బయటకు తీస్తున్నారు.
‘‘జగన్ జైలుకు వెళ్లడం గ్యారంటీ అని మోడీ తనకు చెప్పారని’’ పవన్ అంటున్నారు. ప్రధాని నరేంద్రమోడీ పవన్ కల్యాణ్ కు ఆ విషయం చెవిలో చెప్పారో ఏమో తెలియదు. కానీ.. జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవడానికి, ఆయన మీద అక్కసు వెళ్లగక్కడానికి పవన్ మోడీని అడ్డుపెట్టుకుని మరీ జైలుకు వెళ్తాడు లాంటి ఉబుసుపోని కబుర్లు చెబుతున్నారు. మోడీకి ముడిపెట్టి చెప్పడం వలన అనేక దురర్థాలు వస్తాయి.
ఒకటి- ప్రధాని నరేంద్రమోడీ పవన్ కల్యాణ్ కు మాత్రం ఎందుకు ఆ సంగతి చెప్పారు. ప్రధాని తనకు చెప్పాడని ఎన్నికల సభల్లో ఆ మాట అనడం ద్వారా.. పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రయోజనాన్ని ఆశిస్తున్నాడో.. అది నరేంద్రమోడీకి కూడా ప్రయోజనమే కదా. జగన్ జైలుకు వెళ్తాడని మోడీకి అంత ఖరారుగా తెలిస్తే.. ఆయన స్వయంగా ఏపీలో ఎన్నికల సభల్లో ఆ సంగతి చెప్పవచ్చు కదా. జగన్ ను అభిమానిస్తున్న రాష్ట్రంలో జగన్ జైలుకు పోతాడనే సంగతి చెప్పడానికి మోడీ భయపడుతున్నాడా? అనే అర్థం వచ్చేలా పవన్ మాటలు ఉన్నాయి.
రెండో సంగతి- జగన్ మీద కేసులు విచారణలో ఉన్నాయి ఓకే. కానీ ఆయన జైలుకు వెళ్తాడో లేదో చెప్పడానికి నరేంద్రనమోడీ ఎవరు? ఆయన ఏమైనా జగన్ కేసులను విచారిస్తున్న సీబీఐ కోర్టు లేదా సుప్రీం కోర్టు న్యాయమూర్తా? లేదా న్యాయకోవిదుడా? జగన్ కేసులు తర్వాత అయినా అప్పీలు వేస్తే అంతిమ తీర్పు చెప్పగల సుప్రీం కోర్టు న్యాయమూర్తా? ఏదీ కాదు కదా? దేశానికి ప్రధాని అయినంత మాత్రాన ఒక రాజకీయ నాయకుడు- మరొక ప్రజానాయకుడి గురించి ‘జైలుకు పోతాడని’ ముందే చెబుతున్నారంటే.. ప్రధాని నరేంద్రమోడీ న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తున్నారని పవన్ కల్యాణ్ ధ్రువీకరిస్తున్నట్టు అనుకోవాలా? అనేది రెండో సందేహం.
మొత్తానికి పవన్ కల్యాణ్ అజ్ఞానపూరితమైన తన మాటలతో ప్రధాని నరేంద్రమోడీని ఇరికించేలా ఉన్నారని పలువురు అనుకుంటున్నారు.