అలా చేస్తే పవన్ కల నెరవేరుతుంది!!

“సర్దార్ గౌతు లచ్చన్న స్ఫూర్తితో బీసీలు, గౌడ కులస్తులు ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉంది.. బీసీ కులాల వారందరూ ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం వైపు అడుగులు పడతాయి” ఇలాంటి మాటలు బీసీ కులాలకు చెందిన…

“సర్దార్ గౌతు లచ్చన్న స్ఫూర్తితో బీసీలు, గౌడ కులస్తులు ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉంది.. బీసీ కులాల వారందరూ ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం వైపు అడుగులు పడతాయి” ఇలాంటి మాటలు బీసీ కులాలకు చెందిన నాయకుల నుంచి తప్ప మరొకరి నుంచి ఆశించలేము. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే అగ్రకులాల వారు మాత్రమే ముఖ్యమంత్రి కాగల అవకాశం ఉన్న ప్రస్తుత తరుణంలో, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఈ మాటలు చెప్పడం ఆశ్చర్యకరం! జనసేనాని పవన్ కళ్యాణ్ లోని సామాజిక స్పృహకు నిమ్న కులాల పట్ల ప్రేమకు ఇది నిదర్శనం!! 

ఒకవైపు జనసేన అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రి అవుతానని గొంతు చించుకొని ప్రగల్భాలు పలికే పవన్ కళ్యాణ్.. మరోవైపు బీసీ కులస్తులు, శెట్టిబలిజలు, గౌడ కులస్తులు ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందని.. ఏదో కాటికి కాళ్లు చాపుకున్న వృద్ధనేత లాగా కోరికలు కోరుకోవడం ఏమిటో అర్థం కాని సంగతి.

మహాత్మా గాంధీ ‘‘రేపు చేయవలసిన పనిని ఇవాళే పూర్తి చేయి’’ అని చెప్పిన నీతిని మనం గుర్తు తెచ్చుకోవాలి. విపరీతంగా గ్రంథాలను చదివి వాటి సారాంశాన్ని ఔపోసన పట్టే పవన్ కళ్యాణ్ కు ఈ విషయం తెలియనిది ఏమీ కాదు! బీసీలు గౌడ కులస్తులను ముఖ్యమంత్రి పదవిలో చూడాలనే కోరిక నిజంగా పవన్ కళ్యాణ్ కు అంత ప్రబలంగా ఉంటే గనుక.. ఆయన అలాంటి రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. తాను తలచుకుంటే 2024 ఎన్నికలలోనే తన స్వప్నాన్ని సాకారం చేసుకోగలరు!!

గోదావరి జిల్లాల పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ శెట్టిబలిజ కులస్తులు, గౌడ కులస్తులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో తన మనసులో ఉన్న ఈ విచిత్రమైన కోరికను బయటపెట్టారు. బహుశా ఎస్టీలతో సమావేశం నిర్వహించి ఉంటే యానాదులు, ఎరుకల కులాలకు చెందిన వారు ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉంది అని ఒక కోరికను ప్రకటించగల ధైర్యం ఆయనకు ఉంది. 

ఎస్సీలతో సమావేశం నిర్వహిస్తే మాల మాదిగలు ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉంది అని కూడా ఆయన తెగించి చెప్పగలరు. ఎదుటివారి ముఖప్రీతికి తప్ప అంతరంగంలో చిత్తశుద్ధితో మాట్లాడే అలవాటు తనకు లేదనే సంగతి ప్రజలు గుర్తిస్తారనే భయం పవన్ కళ్యాణ్ కు లేదు. అందుకని ఆయన ఏమైనా చెప్పగలరు!!

ఏ సభలో నోరు మెదిపినా సరే అధికారం మొత్తం ఒకటి రెండు కులాలకే నా మిగిలిన వాళ్లకు దక్కనివ్వరా అని గొంతు చించుకునే పవన్ కళ్యాణ్.. ఇతర కులాల వారిని ముఖ్యమంత్రి పదవిలో చూడాలనే తన కోరికను తక్షణం తీర్చుకోవచ్చు. ‘జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటే తప్ప ఆయనను ఓడించడం అసాధ్యం’ అని వారు భావిస్తున్న తరుణంలో… ‘‘తాను ఏ కులాన్ని ముఖ్యమంత్రి పదవిలో చూడాలనుకుంటున్నాడో ఆ కులానికి ఆ పదవి ఇస్తే తప్ప తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోను’’ అని పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే సరిపోతుంది. 

చంద్రబాబు నాయుడుకు ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం ఎటూ లేదు. పవన్ ఏ నిబంధన పెడితే దానికి ఆయన ఒప్పుకుని తీరాల్సిందే తప్ప గతి లేదు. కాబట్టి కళ్యాణ్ తాను ఏ కులాన్ని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నాడో ఆ నిబంధనతో ఎన్నికలకు వస్తే గనుక కచ్చితంగా కల తీరిపోతుంది!! 

ఇంకా ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడుతూ టైం వేస్ట్ చేయడం ఎందుకు? అలాంటి ప్రకటన చేస్తే సరిపోతుంది కదా అని ప్రజలు పవన్ కళ్యాణ్ కు సలహా ఇస్తున్నారు!!