ఇన్ని రోజులు తెలంగాణ కాంగ్రెస్‌లో చూసినా గొడవలు గత కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీలో కూడా మొదలైనట్లు కనపడుతోంది. మరీ కాంగ్రెస్ వాళ్ళ లాగా డైరెక్ట్‌గా తిట్టుకోకున్న ఒకరిపై మరొకరు ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్లు వేసుకుంటున్నారు. నిన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొంత మంది బీజేపీ నాయకులను టార్గెట్‌గా ట్వీట్టర్లో సెటైర్ వేయగా ఇవాళ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రియాక్ట్ అయ్యారు.
మాజీ ఎంపీ ట్వీట్‌పై ఈటల మీడియాతో మాట్లాడుతూ.. జితేందర్ రెడ్డి ట్వీట్‌కు అర్థం ఏంటో ఆయనే చెప్పాలని.. అయినా ప్రజా జీవితంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని.. వయసు పెరిగే కొద్దీ మరింత జాగ్రత్తగా ఉండాలని ఇతరుల గౌరవాన్ని భంగం కలిగించేలా వ్యవహరించకూడదు అంటూ సుతిమెత్తగా హెచ్చరించారు.
కాగా నిన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ట్వీట్టర్ వేదికగా వాహనం లోకి దున్నపోతును లాగే వీడియోను పోస్ట్ చేస్తూ.. ఇలాంటి ట్రీట్మెంట్ బీజేపీ నేతలకు అవసరం అని ట్వీట్ట్ చేస్తూ.. దానిని బీఎల్ సంతోష్, అమిత్ షా, సునీల్ బన్సల్, కేంద్ర, రాష్ట్ర బీజేపీలకు ట్యాగ్ చేశారు. దానిపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు రావడంతో బండి సంజయ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగ అర్థం చేసుకున్నరంటూ మరో ట్వీట్ చేశారు.
కాగా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవంటూ ఓ వైపు బీజేపీ నేతలు చెబుతుండగా.. ఇప్పటికే గత కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీ మూడు వర్గాలుగా వీడిపోయినట్లు కనిపిస్తోంది. దాంతో ఈ సంవత్సరంలో జరగబోతున్న ఎన్నికల దృష్టిలో పెట్టకోని తెలంగాణ బీజేపీలో పెద్ద ఎత్తున్న మార్పులు రాబోతున్నట్లు తెలుస్తోంది.