దూరపు కొండలు నునుపు అంటారు. ఇంతకాలం పవన్‌కల్యాణ్‌ను దూరం నుంచి చూసిన పిఠాపురంలోని అభిమానులకు… ఆయనంటే ఆహా, ఓహో అనేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. పిఠాపురంలో పవన్ గెలవాలంటే, ఆయన ఇక్కడికి రాకపోవడమే మంచిదన్న అభిప్రాయంలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇటీవల విడతల వారీగా పిఠాపురంలో పవన్‌కల్యాణ్ నాలుగు రోజులు గడిపారు.
ఈ సందర్భంగా కొన్నిచోట్ల ఆయన ప్రజలను నేరుగా కలుసుకున్నారు. అయితే అభిమానులను మాత్రం దూరం పెట్టారని సమాచారం. మరీ ముఖ్యంగా ఆయన బాడీ లాంగ్వేజీని దగ్గర నుంచి చూసిన పిఠాపురం జనాలకు, పవన్ ఏంటో అర్థమైందని అంటున్నారు. తానో దైవాంశ సంభూతుడినన్న లెవెల్‌లో పవన్ బిల్డప్ ఇచ్చారని ఆయన్ను అభిమానించే వాళ్లు విమర్శిస్తున్నారు.
అందుకే పవన్ జనానికి దూరంగా వుంటేనే మంచిదని జనసేన నాయకులు అంటున్నారు. పవన్ పిఠాపురానికి వస్తే… ఆయనపై ఉన్న అభిమానం, గౌరవం కూడా పోతుందనేది జనసేన శ్రేణుల బలమైన అభిప్రాయం. కనీసం ఆయన్ను కలవాలన్నా చుట్టూ ఉన్న భద్రతా సిబ్బంది ఎవర్నీ దగ్గరికి కూడా చేరనివ్వలేదని లబోదిబోమంటున్నారు. పవన్‌ను అభిమానించడం వల్లే ఆవేదన చెందుతున్నామని వారు అంటున్నారు.
ప్రస్తుతం పవన్‌కు సానుకూల పరిస్థితి వుందని, పిఠాపురంలో ఎక్కువ రోజులు ఆయన తిరిగితే ఆయన ఓటమికి బాట వేసుకున్నట్టే అని జనసేన శ్రేణులు తేల్చి చెబుతున్నాయి. పవన్ రాకపోతే, రాష్ట్ర స్థాయిలో తమ నాయకుడు ప్రచారం చేయాల్సి వుంటుందని సరి పెట్టుకుంటామని అంటున్నారు. అలా కాకుండా పిఠాపురంలో తాను పోటీ చేస్తున్నాననే కారణంతో ఇక్కడే ఎక్కువ దృష్టి పెడితే ఓడించడానికి వైసీపీ అవసరం లేదనేది స్థానికుల అభిప్రాయం.