నారా భువనేశ్వరి తన ఎన్నికల ప్రచార సభల్లో ఇప్పుడు పాలిటిక్స్ క్లాసులు కాదు, ప్రజలకు ఫిలాసఫీ క్లాసులు తీసుకుంటున్నారు. నారా భువనేశ్వరి కూడా ఇప్పుడు రాష్ట్రమంతా ముమ్మరంగా తిరుగుతూ రాజకీయ సభలు నిర్వహిస్తూ ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మహిళలతోను, వివిధ సామాజిక వర్గాల వారితో విడివిడిగా సమావేశం అవుతూ.. ఆమె చాపకింద నీరులా ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు. తాజాగా ఒక సమావేశంలో ఆమె రాజకీయాలు మానేసి.. ఫిలాసఫీ క్లాసులు తీసుకుంటున్నట్టుగా ప్రసంగం సాగించడం విశేషం.
‘‘మనందరం ఇవాళ ఉంటాం రేపు పోతాం.. ఎప్పుడు పోతామో తెలియదు. మనం పోయిన తర్వాత కూడా మనం చేసిన పనులు మిగిలిపోవాలి. పోయిన తర్వాత కూడా మన గురించి మాట్లాడుకోవాలి..’’ ఈ మాటలె వింటే చాలు.. ఏమిటబ్బా.. ఏదో ఆధ్యాత్మిక సభలలో ప్రసంగిస్తున్నట్టుగా, ఇంత తాత్వికంగా చెబుతున్నదే అనే అభిప్రాయం కలుగుతోంది కదా. కానీ.. భువనేశ్వరి ఇదంతా చంద్రబాబునాయుడు భజన చేయడానికి చెబుతుండడం విశేషం.
చంద్రబాబునాయుడు.. తాను ఉన్నాలేకపోయినా మిగిలిపోయే పనుల గురించి ఆలోచిస్తున్నారట. రాష్ట్రాన్ని ఆ రకంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారట. అందుకే మళ్లీ సీఎం కావాలని అనుకుంటున్నారట. ఇలా తనకు తెలిసిన ఫిలాసఫీ శాస్త్రాన్ని చంద్రబాబుకు ఆపాదించి భువనేశ్వరి చాలా కబుర్లు చెప్పారు. అయితే ఆమె ఫిలాసఫీ చెప్పడం మాత్రమేనా.. జగన్ అడిగే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతుందా? అని ప్రజలు అంటున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తన ప్రతి సభలోనూ చంద్రబాబునాయుడును ఉద్దేశించి ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు. నలభయ్యేళ్ల సీనియర్ రాజకీయ నాయకుడిని అని చెప్పుకుంటూ, పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకుంటూ ఉండే చంద్రబాబునాయుడు.. ఇన్నేళ్ల పదవీకాలంలో కనీసం ఒక్క పథకంమీదనైనా తన ముద్ర వేయగలిగారా? అని జగన్ ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా చంద్రబాబు బుర్రలోనుంచి పుట్టిన, పూర్తిగా ఆయన సొంత ముద్ర కలిగిన ప్రజాసంక్షేమ పథకం ఒక్కటంటే ఒక్కటైనా ఉన్నదా? అనేది జగన్ సంధిస్తున్న సూటి ప్రశ్న.
తను ఉన్నా లేకపోయినా.. తను చేసిన పని మిగిలిపోవాలనే కోరికతో తన భర్త చంద్రబాబునాయుడు తపించి పోతుంటాడని కితాబు ఇస్తున్న నారా భువనేశ్వరి ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తన భర్త.. కనీసం తనదిగా చెప్పుకోగల ఒక్క పథకాన్ని కూడా తీసుకురాలేకపోయాడంటే.. దానిని ఆమె ఎలా అర్థం చేసుకుంటారు. ఆమెకు కూడా అది అవమానం అనిపించదా అని ప్రజలు అనుకుంటున్నారు.