కడప పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున షర్మిల బరిలో నిలవనున్నారు. ఈ మేరకు ఆమె ప్రకటించారు. షర్మిలకు మద్దతుగా సునీత ప్రచారం చేస్తున్నారు. దీంతో కడపలో అసలేం జరుగుతోందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వుంది. ఈ నేపథ్యంలో కడపలో క్షేత్రస్థాయిలో షర్మిల ఎఫెక్ట్ ఏ మేరకు వుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కడపలో వైసీపీ నుంచి షర్మిల, సునీతలకు వైసీపీ నుంచి ఎలాంటి ఆదరణ లేదు. వైఎస్సార్‌ను అభిమానించే వారెవరూ వాళ్లిద్దరికి మద్దతుగా నిలవడం లేదు. మరీ ముఖ్యంగా అక్కాచెల్లెళ్లకూ కడపలో క్షేత్రస్థాయిలో ఏ ఒక్కరితోనూ అనుబంధం లేదు. ఒకరిద్దరికి సాయం చేసిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు వాళ్లకున్న మద్దతల్లా కేవలం టీడీపీ నుంచే. అలాగే వ్యక్తిగతంగా బీజేపీ నాయకుడు ఆదినారాయణరెడ్డి మద్దతు ఇస్తున్నారు.
గత నెలలో వైఎస్ వివేకానందరెడ్డి సంస్మరణ సభ కడపలో నిర్వహించగా, పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి హాజరయ్యారు. వారి పోరాటానికి మద్దతుగా వాళ్లిద్దరే మాట్లాడారు. అంతిమంగా కడప ఎంపీ బరిలో కాంగ్రెస్ తరపున షర్మిల పోటీ చేయడంపై సస్పెన్ష్‌కు తెరదించారు. అలాగే ఆమెకు మద్దతుగా సునీత సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు వైసీపీ తరపున వైఎస్ అవినాష్‌రెడ్డి మరోసారి బరిలో ఉంటున్నారు. టీడీపీ తరపున ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు, జమ్మలమడుగు ఇన్‌చార్జ్ భూపేష్‌రెడ్డి పోటీ చేయనున్నారు. రెండురోజుల క్రితం షర్మిల, సునీత బద్వేలు నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. వివేకా హత్య కేంద్రంగా అవినాష్‌రెడ్డిని రాజకీయంగా కాల్చేయాలనేది వారి వ్యూహం. అయితే వాళ్ల ప్రచారానికి పట్టుమని 200 మంది కూడా జనం లేరంటే అతిశయోక్తి కాదు.
దీన్ని బట్టి షర్మిల, సునీత ప్రచారానికి జనం నుంచి ఎలాంటి ఆదరణ వుందో అర్థం చేసుకోవచ్చు. జగన్‌ను బద్నాం చేయడానికి ప్రత్యర్థులతో చేతులు కలిపిన అక్కాచెల్లెళ్లపై వైఎస్సార్ అభిమానులు, వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. అందుకే వాళ్లిద్దరినీ కూడా శత్రువుగా చూస్తున్నారు. అయితే వాళ్లిద్దరిపై టీడీపీ నేతలు సన్నిహితంగా మెలుగుతుండడంతో, వారిపై టీడీపీ శ్రేణుల్లో కొంత వరకు సానుభూతి వుంది. కడప ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి బలహీనమైన అభ్యర్థి కావడంతో, షర్మిలకైనా ఓట్లు వేస్తే గెలుస్తుందేమో అన్న చిన్న ఆశ టీడీపీ శ్రేణుల్లో వుంది.
అందుకే ఈ ఎన్నికల్లో షర్మిలకు టీడీపీ ఓట్లు పడతాయనే చర్చ కడప జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. దీనివల్ల టీడీపీ భారీగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. వైసీపీ నుంచి ఒక్కటంటే ఒక్క ఓటు కూడా కాంగ్రెస్‌కు వెళ్లే అవకాశం లేదు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే షర్మిల, సునీత పని చేస్తున్నారనే ప్రచారం, కడపలో టీడీపీని దెబ్బ తీయనుంది. షర్మిల, సునీత కూడా తాము చంద్రబాబు మనుషులమనేలా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో సునీత మీడియాతో మాట్లాడుతూ కృతజ్ఞతలు ఎవరెవరికి చెప్పారో అందరికీ తెలుసు.
తాజాగా షర్మిల, సునీత విషయంలో చంద్రబాబు స్వరం మారడం చూస్తే, ఆయన భయం ఎందుకో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకసారి కడపకు వెళ్లి షర్మిలకు ఎవరి ఓట్లు వెళ్తాయో తెలుసుకుంటే అర్థమవుతుంది.