ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రాజకీయ పంథాతో టీడీపీకి దెబ్బ అని చంద్రబాబునాయుడు భయపడుతున్నారు. వాళ్లిద్దరి రాజకీయ ప్రచారం టీడీపీకి లాభం కలుగుతుందని ఇంతకాలం చంద్రబాబు భ్రమల్లో ఉన్నారు. గత నెలలో ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో భాగంగా అన్నాచెల్లెళ్లిద్దరూ చెరో పార్టీకి నాయకత్వం వహిస్తూ, ఎన్డీఏ కూటమిని దెబ్బ తీయాలని అనుకుంటున్నారని విమర్శించారు.
కానీ బీజేపీ మినహా కూటమిలోని టీడీపీ, జనసేన, ఎల్లో మీడియా షర్మిల, సునీతకు అండగా వుంటున్నాయి. ఇవాళ కూడా సునీత మీడియా సమావేశానికి ఎల్లో మీడియా విపరీతమైన ప్రాధాన్యం ఇచ్చింది. కానీ చంద్రబాబునాయుడు మాత్రం వాళ్లిద్దరి విషయంలో యూటర్న్ తీసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్‌కు వెళ్తాయని, దాని వల్ల కూటమికి దెబ్బ అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే షర్మిల వచ్చారని బాబు వాపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏకు పడే ఓట్లు కాంగ్రెస్‌కు వెళ్లకూడదని ఆయన కోరారు. పెద్ద కాంగ్రెస్, వైసీపీ పిల్ల కాంగ్రెస్ కొత్త డ్రామా రక్తి కట్టిస్తున్నాయని విమర్శించడం గమనార్హం. కాంగ్రెస్‌కు ఓట్లు వేయాలని సునీత ఓట్లు చీలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి వరకు దోషులను పట్టుకోవాలని కోరి, ఇప్పుడు షర్మిలకు ఓటు వేయాలంటూ జగన్‌కే లబ్ధి చేకూరుస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
వివేకా హత్య కేసు విషయంలో ఆయన కుమార్తె సునీత, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చేసే విమర్శలు ఎన్డీఏకి కలిసి వస్తాయని చంద్రబాబు ఆశించారు. కానీ జగన్‌పై వ్యతిరేక ఓట్లు కూటమికి కాకుండా, కాంగ్రెస్‌కు వెళ్తాయనే భయం ఆయనకు మొదటిసారి కలిగింది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని చెట్టపట్టాలేసుకుని చంద్రబాబు తెలంగాణలో తిరిగిన సంగతి తెలిసిందే. అలాంటిది వైసీపీ పిల్ల కాంగ్రెస్ అని విమర్శించి బీజేపీ మెప్పు పొందాలని చంద్రబాబు పరితపిస్తున్నట్టున్నారు. ఏది ఏమైనా షర్మిల, సునీత వల్ల తమకు రాజకీయంగా నష్టమే అని తొలిసారి బాబు మనసులో మాటను బయట పెట్టడం గమనార్హం.