జనసేనాని పవన్‌కల్యాణ్ స్పీచ్‌లో “పవర్” కనిపించింది. మొదటిసారిగా 2024లో జనసేన ప్రభుత్వం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎప్పట్లాగే వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రానున్న రోజుల్లో వైసీపీ లేని ప్రభుత్వం వస్తుందని నమ్మబలికారు.
కోనసీమ జిల్లా మండపేటలో కౌలురైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆత్మహత్య చేసుకున్న 53 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. అనంతరం పవన్‌కల్యాణ్ ఊగిపోతూ ప్రసంగించారు. గతంలో జగన్ చేసిన ప్రసంగాల్ని అనుకరిస్తూ వెటకరించారు. జగన్‌ను నమ్మొద్దని కోరారు. ఒకే ఒక్క అవకాశం జనసేనకు ఇచ్చి చూడాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర భవిష్యత్తుకు వైసీపీ హానికరమని హెచ్చరించారు. అమలు చేయలేని హామీలను జగన్ ఇచ్చారని తప్పు పట్టారు. బుగ్గలు నిమిరాడా, ముద్దులు పెట్టాడా, కౌగలించుకున్నాడా అని చూడొద్దన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేనను గెలిపించాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు రూ.పది లక్షల రుణం ఇస్తామని హామీ ఇచ్చారు.
పాదయాత్రలు చేసి నడిచే ప్రతిఒక్కరూ మహాత్ములు కాదన్నారు. కేవలం అధికార కక్షసాధింపు కోసమే తిరిగారని జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు. బాబా సాహెబ్ అంబేద్కరే తనకు స్ఫూర్తి అన్నారు. అంతటి మహనీయుడు కూడా వరుసగా రెండు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయారన్నారు. ఆ తర్వాత రాజ్యసభకు వెళ్లినట్టు పెద్దలు చెప్పారన్నారు. అలాంటి మహనీయుని పేరు కోనసీమ జిల్లాకు పెడితే తామెందుకు అభ్యంతరం చెబుతామని ప్రశ్నించారు. అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు మొదట స్వాగతించింది జనసేనే అని చెప్పుకొచ్చారు. అయితే అంబేద్కర్‌ను రాజకీయ స్వార్థానికి జగన్ ప్రభుత్వం వాడుకోవడంపైనే తమ అభ్యంతరమని పవన్ తెలిపారు.
ఈసారి వైసీపీ లేని రాష్ట్రప్రభుత్వం చూస్తామని స్పష్టం చేశారు. అవకాశం జనసేనకు ఇస్తే బలంగా ముందుకువెళ్తామన్నారు. మార్పు వచ్చినప్పుడు ఎవరూ ఆపలేరంటూ శ్రీలంక ఉదంతాన్ని గుర్తు చేశారు. వైసీపీ నేతలు కూడా పద్ధతిగా ఉండాలని హితవు చెప్పారు. అక్టోబరు నుంచి రోడ్లపైకి వచ్చిప్పుడు ప్రజలకు జనసేన ఏం చేయబోతోందో వివరిస్తామన్నారు. తాను ముఖ్యమంత్రిని అవుతానో లేదో ప్రజల చేతుల్లో ఉందన్నారు.
అధికార పార్టీ వేలకోట్లు కుమ్మరించినా తాము మాత్రం పోరాటాన్ని నమ్ముకున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగురాష్ట్రాల్లో జనసేన జెండా ఎగరడం ఖాయమని తేల్చి చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే పంచాయతీల నిధులు వాటికే వచ్చేలా చేస్తామన్నారు. జనసేనను గెలిపిస్తే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రజలంతా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను కాకుండా, తనను చూడాలని పవన్‌కల్యాణ్ వేడుకున్నారు. ఏపీని కాపాడే సత్తా జనసేనకే ఉందన్నారు.
గత సమావేశాల్లో ఎన్నికల్లో పొత్తులు, టీడీపీతో స్నేహంపై పరోక్ష సంకేతాలు పవన్‌కల్యాణ్ ఇస్తూ వచ్చారు. అయితే టీడీపీ, బీజేపీ పట్టించుకోకపోవడంతో పవన్ తన పద్ధతిని కూడా మార్చుకున్నట్టు తాజా బహిరంగ సభలో ఆయన ప్రసంగం తెలియజేస్తోంది. పదేపదే జనసేనకు పవర్ (అధికారం)పై మాట్లాడ్డం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే కేవలం వైసీపీని మాత్రమే టార్గెట్ చేస్తూ, టీడీపీపై నోరెత్తకుండా ఉంటే …రాజకీయంగా లాభమా? నష్టమా? అనేది రానున్న రోజుల్లో పవన్‌కు మరింత క్లారిటీ వస్తుంది.