టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేతి నుంచి కుప్పం చేజారిపోతోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఇందుకు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళుతున్న వలసలే సంకేతం అని చెబుతున్నారు. కుప్పానికి పడ్డ చిల్లును పూడ్చడం చంద్రబాబు చేతకావడం లేదు. టీడీపీ శ్రేణులను కాపాడుకోవడంలో చంద్రబాబు విఫలమవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కుప్పం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ ఇన్‌చార్జ్ భరత్ నేతృత్వంలో మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు.
ఏదో రెండు మూడు గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలే కదా అని సర్ది చెప్పుకున్నారు. తాజాగా 200 మందికి పైగా టీడీపీ గ్రామ నాయకులు, కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశమైంది. ఇలా ఒక్కొక్కరే వైసీపీలోకి వెళుతుంటే… ఎన్నికల నాటికి మిగిలేదెవరనే ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
కుప్పం వైసీపీ అభ్యర్థిగా భరత్‌ను ప్రకటించి, గెలిపించాలని ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెట్టారు. నిజానికి కుప్పంలో పోటీ చంద్రబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్యే. పెద్దిరెడ్డిని అది చేస్తా, ఇది చేస్తానని చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నారు. కానీ పెద్దిరెడ్డికి ఉత్తుత్తి మాటలు చెప్పడం చేతకాదు. ఆయనంతా చేతల మనిషి. తానేంటో కుప్పంలో చంద్రబాబుకు రుచి చూపిస్తున్నారు. కుప్పంపై పెద్దిరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. కుప్పంలో గ్రామాల వారీగా వైసీపీ వైపు మళ్లేలా ఆయన టార్గెట్ పెట్టుకున్నారు. ఎన్నికల నాటికి కుప్పం పునాదులను కదిలించొచ్చని పెద్దిరెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది.
మరోవైపు టీడీపీ నుంచి వైసీపీలోకి వరుస వలసలతో ఆ పార్టీ బెంబేలెత్తుతోంది. తాజా చేరికలపై ఏం మాట్లాడాలో టీడీపీకి దిక్కుతోచడం లేదు. దీంతో తన అనుకూల మీడియా ద్వారా ….అంతా తూచ్ తూచ్ అంటుండడం గమనార్హం. కుప్పంలో టీడీపీ పేరిట బోగస్ గుర్తింపు కార్డులను సృష్టించి, వాటితో కొందరిని తమ పార్టీలో చేర్చుకుని, టీడీపీ పని అయిపోయిందనే విష ప్రచారానికి వైసీపీ నేతలు తెరతీశారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారానికి తెరలేపింది.
ఇదే విషయాన్ని చంద్రబాబు లేదా చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు చెప్పి వుంటే విలువ వుండేది. మరి వారెందుకు నోరు మెదపడం లేదు. ఎందుకంటే ఆ ప్రచారంలో వాస్తవం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. అయినా బోగస్ గుర్తింపు కార్డుదారు లను చేర్చుకోవడం ఉపయోగం లేదని వైసీపీ నేతలకు తెలియదా? ఎల్లో మీడియా ప్రచారంలో నిజమే వుంటే…. ఈ పాటికి టీడీపీ నేతలు భూమి బద్ధలైనట్టు పెద్ద ఎత్తున విమర్శలు చేయకపోయారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో టీడీపీ తరఫున మల్లనూరు ఎంపీటీసీగా పోటీ చేసిన నారాయణస్వామి, మాజీ ఉప సర్పంచ్ పీవీ సెల్వం, వార్డు సభ్యుడు కుప్పన్, గ్రామ పెద్ద సత్తి తదితరులు ఉండడం నిజం కాదా? కుప్పంలో టీడీపీ కంచుకోటను బద్ధలు కొట్టడమే పనిగా మంత్రి పెద్దిరెడ్డి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్టు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.
ఆ కర్తవ్య నిర్వహణలో పెద్దిరెడ్డి ముందుకెళుతున్నట్టు క్షేత్రస్థాయిలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలే చెబుతున్నాయి. కుప్పంలో చంద్రబాబునే ఓడిస్తే…. ప్రధాన ప్రత్యర్థి టీడీపీ పనై పోతుందని వైసీపీ నమ్ముతోంది. వాస్తవాల్ని గ్రహించకుండా… వైసీపీపై గుడ్డి వ్యతిరేకత, తమను తాము అదే రీతిలో టీడీపీ, దాని అనుబంధ మీడియా సమర్థించుకోవడం వల్ల భవిష్యత్‌లో భారీ మూల్యం చెల్లించుకోవలసి వుంటుంది.
రాజకీయాల్లో వ్యూహాలే అంతిమంగా విజేతగా నిలుపుతాయి. గెలిచిన వారిదే చరిత్ర. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంపై ఆ పార్టీ ఎన్ని విమర్శలు, వివరణలు ఇచ్చినా ఓటమి ఎప్పటికీ గెలుపు కాదు. కనీసం నామినేషన్ వేసేందుకు కూడా వెళ్లని చంద్రబాబు…. ఇప్పుడు రెండు నెలలకోసారి కుప్పంలో మూడురోజుల పాటు పర్యటించడానికి ఓటమి కారణం కాదని చెప్పగలరా? ఏమో రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా చంద్రబాబే ఓడిపోవచ్చు.
బైబై బాబు అంటూ కుప్పం వైసీపీ పెద్ద ఎత్తున క్యాంపెయిన్‌కు ప్లాన్ చేస్తోంది. ఈ నినాదం జనాల్లోకి వెళితే…అసాధ్యం అనేది ఏదీ లేదు. అందులోనూ జగన్ సంకల్పానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టుదల తోడైంది. కుప్పంలో తాజా రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే…. చంద్రబాబు ఎడమ కన్ను అదురుతున్నట్టుగా సమాచారం.
సొదుం రమణ