జనసేన అధినేత వీలు చూసుకుని మరోసారి విశాఖ జిల్లా ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఆయన మే 1న పెందుర్తిలో తన పార్టీ అభ్యర్ధికి అనుకూలంగా ప్రచారం చేస్తారు అని పార్టీ వర్గాలు తెలిపాయి. పెందుర్తి సభతో పవన్ తిరిగి వెళ్తారని అంటున్నారు.
విశాఖ సౌత్ లో జనసేన పోటీ చేస్తోంది. ఎలమంచిలి నుంచి మరో అభ్యర్ధి ఆ పార్టీ నుంచి ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో సీటు కూడా జనసేన తీసుకుంది. ఇప్పటి దాకా జనసేన తరఫున పవన్ రెండు సభలే ఉత్తరాంధ్రలో నిర్వహించారు. ఒకటి అనకాపల్లి. రెండవది నెల్లిమర్ల. మిగిలిన అభ్యర్ధులకు ప్రచారం చేయాల్సి ఉంది.
పెందుర్తి సీటు కోరి తెచ్చుకోవడంతో పాటు అక్కడ మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి అలగడంతో ఆయనను బుజ్జగించి దారికి తెచ్చుకున్నారు. అయినా కూటమిలో లుకలుకలు అలాగే ఉన్నాయని అంటున్నారు. దాంతో పెందుర్తిలో టఫ్ గా ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ పెందుర్తి ప్రచారానికి వస్తున్నారు అని చెబుతున్నారు.
మిగిలిన మూడు జనసేన సీట్లతో పాటు కూటమికి పవన్ ఉత్తరాంధ్రాలో విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంది. ప్రచారానికి ముగింపు గడువు దగ్గర పడుతోంది. దీంతో పవన్ ప్రచారం షెడ్యూల్ కోసం జనసైనికులతో పాటు కూటమి నేతలు ఎదురు చూస్తున్నారు.