వారాహి ని క్లీన్ చేసి, సర్వీస్ చేయండి

భలే చిత్రమైన హెడ్డింగ్ కనిపించింది ఈ రోజు ప్రింట్ మీడియాలో. ‘వారాహిని సిద్దం చేయండి.. జనసేన నాయకులకు పవన్ ఆదేశం’ ఇదీ ఆ హెడ్డింగ్. ఫ్యాక్షనిజం జానర్ సినిమాల్లో తరచు వినిపిస్తుంటుంది..’తియ్యండ్రా బళ్లు’ అని.…

భలే చిత్రమైన హెడ్డింగ్ కనిపించింది ఈ రోజు ప్రింట్ మీడియాలో. ‘వారాహిని సిద్దం చేయండి.. జనసేన నాయకులకు పవన్ ఆదేశం’ ఇదీ ఆ హెడ్డింగ్. ఫ్యాక్షనిజం జానర్ సినిమాల్లో తరచు వినిపిస్తుంటుంది..’తియ్యండ్రా బళ్లు’ అని. అచ్చం అలాగ్గా వుందీ హెడ్డింగ్.

జనసేన నేతలకు వారాహిని సిద్దం చేయమని పవన్ ఆదేశించడం ఏమిటి?  డ్రైవ‌ర్‌కు చెబితే వాహనం బయటకు తీస్తాడు కదా. దానికి జనసేన నేతలు ఏం చేస్తారు. వారాహి శుభ్రంగా వాటర్ సర్వీస్ చేసి, ఇంజన్ ఆయిల్ మార్పించి, డీజిల్ కొట్టించాలా? ఓవర్ భక్తి అంటే ఇదేనేమో?

సరే ఈ సంగతి అలా వుంచితే పవన్ ప్రచారం కేవలం జనసేన పోటీ చేసే స్థానాలకు మాత్రమే పరిమితం అంట. అంటే కేవలం రెండు పదుల స్థానాల్లో మాత్రమే. పైగా పిఠాపురంలోనే 20 రోజులు వుంటారట. అంటే సగం రోజులు అక్కడ మిగిలిన సగం రోజులు ప్రచారం. అంటే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రోజు అన్నమాట.

మొత్తం మీద ఇప్పుడు వచ్చిన క్లారిటీ ఏమిటంటే జనసేన రాష్ట్రం అంతా పోటీ చేయకపోవడమే కాదు, ప్రచారం కూడా చేయదు. కానీ మిగిలిన చోట్ల వున్న జనసేన జనాలు అంతా తెలుగుదేశం పల్లకీ మాత్రం మోయాలి. అంతే కదా. పవన్ రారు. పోటీ వుండదు. కానీ కార్యకర్తలు మాత్రం ఎన్నికల్లో తిరగాలి. తిరిగి ఏం చేయాలి అంటే తెలుగుదేశాన్ని గెలిపించాలి.

అంటే పవన్ కేవలం జనసేన బలాన్ని వర్చ్యువల్ గా తెలుగుదేశానికి ఇచ్చేస్తున్నారన్నమాట. దాన్ని ఎలా వాడుకోగలిగితే అలా తెలుగుదేశం వాడుకుంటుంది. పవన్ చేసే ప్రసంగాలు అన్నీ రాష్ట్రం అంతా ప్రసారం ఎలా చేయాలో ఆ పార్టీనే చూసుకుంటుంది. వారాహికి టోటల్ పర్మిట్ లేదు.. లిమిటెడ్ పర్మిట్ అన్నమాట. అక్కడిక్కడే తిరుగుతుంది. అంతకు ముందు ఈస్ట్ వెస్ట్ చాలా వరకు తిరిగింది. కృష్ణ, గుంటూరు అని ఒకటి రెండు రోజులకే ఆగిపోయింది. ఉత్తరాంధ్ర సంగతి సరేసరి. ఇక రాయలసీమ సంగతి చెప్పేదేముంది?

అదీ పవన్ వ్యవహారం. అలా వుంటుంది.