జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ఇది సిగ్గు పడాల్సిన సమయం, సందర్భం. అప్పుడప్పుడు జనంలోకి వచ్చి, వైఎస్ జగన్‌తో పాటు వైసీపీ నేతలపై రంకెలు వేయడం తప్ప, పార్టీని బలోపేతం చేసే ఏ ఒక్క పని పవన్ చేయలేదనే విమర్శ వుంది. జనసేన పదో పుట్టిన రోజు జరుపుకుంటున్న తరుణంలో తన రాజకీయ పంథాపై పవన్ ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
ప్రస్తుతం గ్రాడ్యుయేట్స్, పట్టభద్రులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తమ అధినాయకుడి ఆదేశాలంటూ ఓ పిలుపు ఇచ్చారు. అదేంటో చూద్దాం.
“ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆదేశించారు. పార్టీ లక్ష్యమైన వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌కు అనుగుణంగానే పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా కార్యకర్తలు, నాయకులు క్షేత్రస్థాయిలో పని చేయాలి” అని ఆయన కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో తేల్చుకోలేని దయనీయ స్థితిలో పవన్‌కల్యాణ్ ఉన్నారని అర్థమైంది. కనీసం తన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు నేరుగా ఫలానా అభ్యర్థికి, పార్టీ మద్దతుదారులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయాలని పిలుపు ఇవ్వని వ్యక్తి కూడా నాయకుడేనా? అనే ప్రశ్న వెల్లువెత్తుతోంది. పవన్ ఆదేశించారట, నాదెండ్ల ఆ సమాచారాన్ని చేరువేస్తున్నారట. రాజకీయాల కంటే సినిమాలే అంత ముఖ్యమయ్యాయా?
మరీ ముఖ్యంగా జనసేన పదో వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామని చెబుతున్న తరుణంలో కొన్ని కీలకమైన ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన లక్ష్యమని ప్రకటించుకుంటున్నప్పుడు… మరి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ తన అభ్యర్థులను ఎందుకు నిలపలేదనే ప్రశ్న వినవస్తోంది. జనసేనను స్థాపించి పదేళ్లు అవుతున్నా కనీసం వైసీపీకి వ్యతిరేకంగా తాను పోటీ చేయకుండా, ఎవరో నిలబడితే ఓడించాలని పిలుపు ఇవ్వడం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.
నిజంగా జగన్‌ను ఓడించాలని అనుకుంటే నేరుగా ఢీకొట్టాలని, అలా కాకుండా వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని పిలుపు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటనే నిలదీతలు వ్యక్తమవుతున్నాయి. జనసేనను స్థాపించి పదేళ్లు అయినా, ఇప్పటికీ జగన్ పార్టీపై అభ్యర్థులను నిలబెట్టుకోలేని దుస్థితిలో జనసేన ఉన్నందుకు పవన్‌కిది సిగ్గుపడాల్సిన సమయం, సందర్భం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.