చంద్రబాబు దత్త పుత్రుడిగా ప్రత్యర్థుల విమర్శలకు గురవుతున్న జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ఎల్లో మీడియా విపరీతమైన ప్రచారం ఇస్తోంది. ఇదే సందర్భంలో చంద్రబాబు కన్న పుత్రుడు నారా లోకేశ్‌ను మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఇప్పటం గ్రామం వార్తలకెక్కింది. ఇది మంగళగిరి నియోజకవర్గంలో వుంటుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరపున లోకేశ్ పోటీ చేసి ఓటమి రుచి చూశారు.
2024లో కూడా మంగళగిరి నుంచే పోటీ చేసి టీడీపీకి గెలుపును గిఫ్ట్‌గా ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్ల ప్రహరీల తొలగింపును జనసేనాని తీవ్ర వివాదం చేశారు. గత శనివారం ఆ గ్రామానికి వెళ్లి ఓవరాక్షన్‌తో అభాసుపాలయ్యారు. సొంత నియోజకవర్గంలో తీవ్ర రాజకీయ వివాదం చోటు చేసుకున్నప్పటికీ నారా లోకేశ్ నింపాదిగా వుంటూ వచ్చారు.
ఇవాళ ఆయన ఇప్పటం గ్రామానికి వెళుతున్నారు. అయితే లోకేశ్ ఇప్పటం పర్యటనకు సొంత మీడియా కూడా ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే పవన్‌కల్యాణ్ ఇప్పటం వెళ్తారనే సమాచారం అందిన మొదలు… ఎల్లో మీడియా హడావుడి చేసింది. మంగళగిరిలో పార్టీ కార్యాలయం నుంచి బయల్దేరిన మొదలు, ఇప్పటంలో పర్యటన వరకూ ప్రతిక్షణం లైవ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
పవన్ ఇప్పటం వెళ్లడం కూడా సంచలనం అన్నట్టుగా ప్రచారం చేసిన మీడియా… తాజాగా లోకేశ్ పర్యటన గురించి పట్టించుకోకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశా ఆయన మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి చేరుకోవచ్చు. బాధితులతో మాట్లాడనున్నారు. పవన్‌తో పోల్చితే లోకేశ్‌కు అంత సీన్ లేదని ఎల్లో మీడియానే పరోక్షంగా చెబుతోందన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
పవన్‌ను ఎంత హైలెట్ చేస్తే, టీడీపీకి అంత లాభమనే రాజకీయ లెక్కల్లో మునిగి తేలిన ఎల్లో మీడియా… విపరీత ప్రాధాన్యం ఇస్తోందని చెబుతున్నారు. కానీ కన్న కొడుకు విషయానికి వచ్చే సరికి…లోకేశ్‌ను ఎంత తక్కువ చూపితే టీడీపీకి అంత మంచిదనే సంకేతాల్ని సదరు మీడియా పరోక్షంగా ఇస్తున్నట్టు నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు.