జనసేన ప్రజాప్రతినిధుల సత్కార సభలో ఆ పార్టీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఎవరిని ఉద్దేశించి పవన్ వార్నింగ్ ఇచ్చారనే చర్చకు తెరలేచింది. జనసేనలో రౌడీయిజం చెల్లదని, తనను బెదిరించాలనే ధోరణిలో మాట్లాడితే కుదరదని పవన్ తేల్చి చెప్పారు. తాము లేకపోతే పార్టీ నడవదనే భావన నుంచి బయటికి రావాలని కొందరు నాయకులకు హెచ్చరిక ఇవ్వడం గమనార్హం.
ఇంతకూ పవన్‌కల్యాణ్ ఎవరిని ఉద్దేశించి ఆ హెచ్చరికలు చేశారనే చర్చ జనసేనలో అంతర్గతంగా సాగుతోంది. కొందరు జనసేన నాయకులు సోషల్ మీడియాలో సొంత పార్టీ నేతలపై వ్యతిరేకంగా వీడియోలు, పోస్టులు పెడుతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని కూడా పవన్ అన్నారు. తిరుపతి, రాజోలు, పిఠాపురం తదితర నియోజకవర్గాల్లో జనసేనలో గొడవలు ఇటీవల వీధికెక్కాయి. కొంత మంది జనసేన నాయకులు మొదటి నుంచి తాము పార్టీలో ఉన్నామని, కానీ ఇప్పుడు ప్రాధాన్యం ఇవ్వలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇలాంటి వారిని ఉద్దేశించే పవన్‌కల్యాణ్ హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతోంది. తిరుపతి జనసేన ఇన్‌చార్జ్‌పై ఇటీవల సొంత పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ పరోక్ష హెచ్చరిక చేశారు. ఉంటే ఉండండి, ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలనే రీతిలో పవన్ మాట్లాడ్డంపై కొందరు జనసేన నేతలు నొచ్చుకుంటున్నారు. కూటమి అధికారంలోకి రావడానికి జనసేన కీలక పాత్ర పోషించిందని, కార్యకర్తలు, నాయకులు అందరూ శ్రమించారనే చర్చ జరుగుతోంది.
పవన్‌కల్యాణ్‌తో కొందరు నేతలు బెదిరింపు ధోరణిలో మాట్లాడ్డం వల్లే ఆయన బహిరంగంగా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరిని ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశాననో తెలుసు అని కూడా ఆయన అన్నారు. అధికారంలో వుండడం వల్ల ఇప్పుడు జనసేన నాయకులు నోరు తెరవక పోవచ్చని, ఎల్లకాలం ఇదే పరిస్థితి వుండదని కొందరు అంటున్నారు. మొత్తానికి జనసేనలో ఏదో జరుగుతోందన్న చర్చకు పవన్ కామెంల్స్ కారణమయ్యాయి.