ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం దొంగ ఓట్లపై రచ్చ సాగుతోంది. దొంగ ఓట్ల సృష్టికర్తలు మీరంటే, కాదు మీరని అధికార, ప్రతిపక్షాల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఓట్ల చేర్పు, తొలగింపుపై అన్ని రాజకీయ పక్షాలు అప్రమత్తంగా వున్నాయి. ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దొంగ ఓట్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కుప్పం నియోజక వర్గంలో చంద్రబాబు మెజార్టీపై ఆయన తీవ్రంగా స్పందించారు.
కుప్పం ప్రజలకు వలంటీర్లు సేవ చేస్తే, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో దాక్కున్నారని దుయ్యబట్టారు. కుప్పం ప్రజలు జగన్ వెంటే ఉన్నారని ఆయన చెప్పారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో సీఎం జగన్ లాంటి గొప్ప నాయకుడిని చూడలేదని ప్రశంసంలతో ముంచెత్తారు. చంద్రబాబు తన హామీలను మరిచిపోవడం అలవాటని వెటకరించారు. ఇదే జగన్ విషయానికి వస్తే హామీలను తప్పనిసరిగా నెరవేరుస్తారని అన్నారు.
2019లో 30 వేల మెజార్టీకి పరిమితమైన చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీ ఎలా వస్తుందో చూస్తామని మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో తమ అభ్యర్థి చంద్రమౌళి ఆసుపత్రిలో అనారోగ్యంతో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ 30వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు. ఈ దఫా ఆయన కుమారుడు ఎమ్మెల్సీ భరత్ కుప్పం నుంచి విజయం సాధిస్తారని పెద్దిరెడ్డి అన్నారు. సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు మోసాన్ని కుప్పం ప్రజలు పసిగట్టారని ఆయన అన్నారు.
చంద్రబాబు అధికారంలో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 60 లక్షల దొంగ ఓట్లపై ఎమ్మెల్యేలను, ఎంపీలను అప్రమత్తం చేశామని ఆయన చెప్పారు. కుప్పంలో ఇప్పటి వరకు 17 వేల ఓట్లు గుర్తించినట్టు పెద్దిరెడ్డి చెప్పారు. మరో 25 వేలకుపైగా దొంగ ఓట్లు ఉన్నాయని ఆయన అన్నారు. వాటి ఏరివేతలో తమ కేడర్ నిమగ్నమైందని ఆయన అన్నారు.