ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు…మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు!

ఈ నెల 7న జ‌గ‌న్ కేబినెట్ భేటీ అవుతున్న నేప‌థ్యంలో ముంద‌స్తు ఎన్నిక‌ల అంశం తెర‌పైకి వ‌చ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు జ‌గ‌న్ కూడా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం వుంద‌నే ప్ర‌చారం…

ఈ నెల 7న జ‌గ‌న్ కేబినెట్ భేటీ అవుతున్న నేప‌థ్యంలో ముంద‌స్తు ఎన్నిక‌ల అంశం తెర‌పైకి వ‌చ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు జ‌గ‌న్ కూడా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం వుంద‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. ఏపీలో మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశాలే ఎక్కువ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, అసెంబ్లీని అక్టోబ‌ర్‌లో ర‌ద్దు చేస్తార‌ని కూడా చెబుతున్నారు.

ఈ వార్త‌ల నేప‌థ్యంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ఆలోచ‌నే త‌మ‌కు లేద‌ని తేల్చి చెప్పారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌తో పాటు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేయ‌డంతో ఊహాగానాల‌కు తెర‌ప‌డిన‌ట్టైంది.

ఏపీలో వైసీపీ బలంగా ఉంద‌న్నారు. త‌మ‌కు వేరే పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేద‌న్నారు. చంద్ర‌బాబు రాజ‌కీయంగా అంగ‌వైక‌ల్యంతో బాధ‌ప‌డుతున్నార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. అందుకే వేరే రాజ‌కీయ పార్టీల‌పై చంద్ర‌బాబు ఆధార‌ప‌డుతున్నార‌ని అన్నారు. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ గురించి తానేం మాట్లాడ‌న‌ని ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం. 

త‌ద్వారా ప‌వ‌న్‌క‌ల్యాణ్ గురించి మాట్లాడి త‌న స్థాయిని దిగ‌జార్చుకోలేన‌ని పెద్దిరెడ్డి ప‌రోక్షంగా చెప్పిన‌ట్టైంది. జ‌గ‌న్ కేబినెట్‌లో సీనియ‌ర్ మంత్రి అయిన పెద్దిరెడ్డి వ్యాఖ్య‌ల‌కు విలువ వుంది. అందుకే పొత్తుల‌పై ఆయ‌న కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.