ఎవరితో పొత్తులు పెట్టుకుంటామో వైసీపీ నేతలకు ఎందుకని, అసలు తామెందుకు చెబుతామని మాట్లాడిన జనసేనాని పవన్‌కల్యాణ్‌కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూటిగా ఓ ప్రశ్న సంధించారు. ప్రత్యర్థులమైన తమకు చెప్పకపోయినా ఫర్వాలేదని, కనీసం ప్రజలకైనా చెప్పాలని మంత్రి పెద్దిరెడ్డి హితవు పలికారు.
వైసీపీ నేతలు రెచ్చగొట్టినా తాము రెచ్చిపోమని జనసేనాని పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే. సింహం సింగిల్‌గా వస్తుందంటూ అధికార పార్టీ నేతలు కవ్వింపు వ్యాఖ్యలు చేసినా, తాము పౌరుషానికి పోమని పవన్‌కల్యాణ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో వ్యూహాలకు తప్ప పౌరుషాలకు స్థానం లేదని ఆయన జ్ఞానదోయం అయినట్టు మాట్టాడారు.
ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయాల నుంచి వైదొలగక తప్పదని జోస్యం చెప్పారు. ఇవే చివరి ఎన్నికలని పెద్దిరెడ్డి చెప్పకనే చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ప్రజల్లో విశ్వసనీయత లేదన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో గెలవనని చంద్రబాబుకు బాగా తెలుసన్నారు.
అందుకే పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నట్టు పెద్దిరెడ్డి చెప్పారు. ఏపీలోని అన్ని పార్టీలతో చంద్రబాబు పెట్టుకోవాలని పెద్దిరెడ్డి సలహా ఇచ్చారు. సీఎం జగన్‌పై ప్రజల్లో అభిమానం ఉందని, అందుకే తాము ధైర్యంగా ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు పెద్దిరెడ్డి తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తోడు దొంగలని అందరికీ తెలుసని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు.
బీజేపీతో పొత్తులో ఉండి టీడీపీతో మరో పొత్తుకు పవన్‌కల్యాణ్ ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో కనీసం ప్రజలకైనా స్పష్టత ఇవ్వాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేయడం విశేషం. ప్రజానీకానికి కాకపోయినా, కనీసం తన పార్టీ కార్యకర్తలు, నాయకులకైనా స్పష్టత ఇస్తే అదే మహాభాగ్యం.
ఒక శుభముహూర్తాన బీజేపీతో విడాకులు తీసుకుని టీడీపీతో సహజీవనం మొదలు పెట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.