సాధారణంగా ప్రజల నమ్మకాల్లో ఉండే ప్రకారం ఒట్టు పెట్టడంలో ఉండే ఆంతర్యం ఏమిటి? మనం ఒట్టు పెట్టి అబద్ధం చెబితే గనుక.. ఎవరిమీదనైతే ఒట్టు పెడుతున్నామో, వారు చచ్చిపోతారన్న మాట. అంతేకదా? అందుకే అమ్మమీద ఒట్టు, నాన్న మీద ఒట్టు, బిడ్డమీద ఒట్టు అంటూ పలువురు ‘ఒట్టు పెట్టడానికి’ ఒక ఉద్వేగాన్ని జోడిస్తుంటారు.
అదే సమయంలో ‘నామీద ఒట్టు’, ‘నేను చచ్చినంత ఒట్టు’ అని చెప్పేవాళ్లు కూడా ఉంటారు. ‘నీ మీద ఒట్టు’ అని అనడాన్ని కామెడీకింద మనం గమనిస్తూ ఉంటాం. కానీ.. గుంటూరు రాజకీయాల్లో ఒక సరికొత్త ఒట్టు.. పైన చెప్పుకున్న అన్నింటికంటె కామెడీ ఒట్టు కనిపిస్తోంది. అదేంటంటే.. గుంటూరు ఎంపీ స్థానానికి తెలుగుదేశం తరఫున పోటీచేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ తన నిజాయితీ గురించి చెప్పుకోవడానికి ఏకంగా జనసేనాని పవన్ కల్యాణ్ మీద ఒట్టు పెట్టేశారు.
పవన్ కల్యాణ్ కు ఇప్పుడు పిఠాపురంలో తన సీటు గెలవడం కంటె తెనాలిలో నాదెండ్ల మనోహర్ ను గెలిపించుకోవడం అనేది తలకుమించిన భారంగా మారిపోతున్నట్టు కనిపిస్తోంది. పిఠాపురంలో వర్మ సహకరించినట్టుగా, తెనాలిలో ఆలపాటి రాజా నుంచి అదేమాదిరి సహకారం అందడం లేదు. ఆ నియోజకవర్గంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్న పవన్ కల్యాణ్ తాజాగా అక్కడ వారాహి విజయభేరి సభను నిర్వహించారు. ఈ సభలో గుంటూరు లోక్ సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా మాట్లాడారు.
‘‘ప్రజల కోసం తన సొంత సంపాదనను ధారపోసిన నాయకుడు శ్రీ పవన్ కల్యాణ్, ఆయన సాక్షిగా చెబుతున్నాను.. అవినీతికి తావు లేకుండా ప్రజల కోసం పని చేస్తాను’’ అంటూ పెమ్మసాని చెప్పుకొచ్చారు. నువ్వు నిజాయితీగా పనిచేస్తాననడానికి పవన్ మీద ఒట్టుపెట్టడం ఏమిటి స్వామీ అని పవన్ అభిమానులు విస్తుపోతున్నారు.
ఇదేదో.. జంధ్యాల సినిమాలో తనకు ఏ కోరిక తీరినా సరే, తన గుమాస్తాకు గుండు కొట్టిస్తానని మొక్కుకుంటూ ఉండే సుత్తి వీరభద్రరావు కేరక్టర్ లాగా, మొగుడికి గుండు కొట్టిస్తానని మొక్కుకునే శ్రీలక్ష్మి కేరక్టర్ లాగా ఉన్నదని జనం నవ్వుకుంటున్నారు.