రెండో విడత మంత్రి వర్గ విస్తరణలో జాక్పాట్ కొట్టిన మహిళా మంత్రి ఉషశ్రీచరణ్తో పాటు ఆమె అనుచరులపై హైకోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలైంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి ఉషశ్రీ చరణ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కళ్యాణదుర్గంలో సర్వే నంబర్ 329లో 100 ఎకరాలకు పైగా ఉన్న సుబేదార్ చెరువును మట్టితో పూడ్చి మంత్రి, ఆమె అనుచరులు ప్లాట్లగా వేసి అమ్ముకుంటున్నారని ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ఉమామహేశ్వరరావు నాయుడు పిటిషన్ దాఖలు చేశారు.
చెరువు ఆక్రమణ విషయమై స్థానిక రెవెన్యూ అధికారులు మొదలుకుని ఉన్నతస్థాయి అధికారుల వరకూ ఫిర్యాదు చేసినా ఫలితం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. ప్రతివాదులుగా రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్డీవో, తదితర అధికారులను చేర్చారు. ఈ పిటిషన్ను హైకోర్టు స్వీకరించింది.
కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేసును రెండు వారాలకు వాయిదా వేసింది. ఇదిలా వుండగా కళ్యాణదుర్గంలో చెరువు ఆక్రమణ విషయమై బంతి హైకోర్టు చేరడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. కళ్యాణదుర్గం పట్టణ సమీపంలోని చెరువు పూడ్చివేతను వెంటనే అడ్డుకోవాలని టీడీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇనచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు జిల్లా రెవెన్యూ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు.
ఆక్రమణను అడ్డుకోకపోతే కళ్యాణదుర్గం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం మున్సిపాల్టీ సర్వే నెంబరు 329లో 92.81 ఎకరాల భూమిని 1974లో ల్యాండ్ సీలింగ్ చట్టం కింద ప్రభుత్వం తీసుకుందని రెవెన్యూ అధికారుల దృష్టికి ఉమా తీసుకెళ్లారు. 1975లో ల్యాండ్ సీలింగ్లో తీసుకున్న ఆ భూమిని సర్వే చేశారు. అందులో 40 ఎకరాలు సుబేదార్ నీటికుంటకు, 52.81 ఎకరాలను భూమిలేని నిరుపేదలకు పట్టా ఇచ్చేందుకు అభ్యంతరం లేదని అప్పట్లో నియమించిన కమిటీ తేల్చి చెప్పింది.
ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి ఉష శ్రీచరణ్ అండతో చెరువును కబ్జాచేసి పూడ్చివేస్తున్నారనేది టీడీపీ ఫిర్యాదు. విలువైన భూమిని కాపాడాలని టీడీపీ న్యాయపోరాటం చేస్తుండడం చర్చకు దారి తీసింది.