కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ప్రచారానికి తెరలేచింది. బీజేపీలో ఆయన కీలక మైనార్టీ నేత. మోదీ కేబినెట్‌లో మైనార్టీ వ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా వుండగా ఇద్దరు కేంద్రమంత్రులు ఒకేసారి పదవుల నుంచి తప్పుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీతో పాటు ఆర్‌సీపీ సింగ్ కూడా మంత్రి పదవి నుంచి వైదొలిగారు. వీళ్లద్దరి రాజ్యసభ పదవీ కాలం గురువారంతో ముగియనుంది. అయితే నఖ్వీ రాజీనామా చేస్తారనే కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నఖ్వీ బరిలో నిలిచే అవకాశాలున్నాయని జాతీయ మీడియా చెబుతూ వస్తోంది. తాజా రాజీనామాతో ఆ ప్రచారానికి బలం కలుగుతోంది.
మైనార్టీలపై మోదీ సర్కార్ అణిచివేత చర్యలకు దిగుతోందనే ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు నఖ్వీని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నిలపనున్నట్టు సమాచారం. ఇవాళ ఉదయం ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాలతో నఖ్వీ భేటీ కావడం ప్రాధాన్యం ఏర్పడింది.
రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము అనే గిరిజన మహిళను ఎన్‌డీఏ నిలిపిన సంగతి తెలిసిందే. అణగారిన, మైనార్టీ వర్గాలకు బీజేపీ అధిక ప్రాధాన్యం ఇస్తోందనే సంకేతాల్ని పంపేందుకు ద్రౌపది, అలాగే నఖ్వీ అభ్యర్థిత్వాలు దోహదం చేస్తాయని బీజేపీ భావిస్తోంది.
రానున్న కాలమంతా ఎన్నికల సీజన్ కావడంతో, ఆ కోణంలోనే పదవుల పంపకం వుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వచ్చే ఏడాది తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ వుంది. నఖ్వీ అభ్యర్థిత్వంతో కనీసం మైనార్టీల్లో వ్యతిరేకతను తగ్గించుకోవచ్చనే ఎత్తుగడ కూడా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.