జనసేనాని పవన్‌కల్యాణ్ కామెంట్స్ పిఠాపురం టీడీపీలో మంటలు రేపాయి. పిఠాపురంలో తాను పోటీ చేయనున్నట్టు పవన్‌కల్యాణ్ ప్రకటించడమే ఆలస్యం. ఆ వెంటనే పిఠాపురం టీడీపీ కార్యాలయంలో జెండాలు, ప్లెక్సీలను సొంత పార్టీ శ్రేణులు తగులబెట్టాయి. పిఠాపురంలో తమ నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మకు అన్యాయం చేసి, జనసేనకు టికెట్ కేటాయించారంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి.
పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఓట్లు 90 వేలు ఉన్నాయని, ఆ నియోజకవర్గమే తనకు సురక్షితమని పవన్‌కల్యాణ్ భావించారు. దీంతో అక్కడే నిలబడతానని చంద్రబాబునాయుడికి పవన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ వర్మను వారం నుంచి టీడీపీ పెద్దలు బుజ్జగిస్తున్నారు. అయినప్పటికీ వర్మ వినిపించుకోవడం లేదు. పిఠాపురం నుంచి 2019లో ఓడిపోయినప్పటికీ, ప్రజల్లోనే వున్నానని, ఇప్పుడు పవన్‌కల్యాణ్ కోసం తనను బలి పశువు చేయడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు.
రెండు రోజులుగా పిఠాపురంలో వర్మ అనుచరులు స్థానికులకే టికెట్ ఇవ్వాలని; లోకల్స్ ముద్దు, నాన్ లోకల్స్ వద్దు అంటూ పెద్ద ఎత్తున ప్లెక్సీలు, వాల్‌పోస్టర్లతో ప్రచారం నిర్వహిస్తున్నారు. వీటికి కౌంటర్‌గా పవన్‌కల్యాణ్ పోటీ చేయనున్నారని జనసేన శ్రేణులు ప్రచారం చేపట్టారు. ఒకవైపు పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య రచ్చ సాగుతుండగా, పవన్‌కల్యాణ్ ఆజ్యం పోసినట్టుగా పోటీపై క్లారిటీ ఇచ్చారు.
పిఠాపురంలోని టీడీపీ కార్యాలయానికి టీడీపీ కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారు. పార్టీ ప్లెక్సీలు, జెండాలను చించేసి, వాటిని రోడ్డుపైకి తెచ్చి దగ్ధం చేశారు. ఈ పరిణామాలపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కనీసం తమ పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తాడని చెబుతున్నా, టీడీపీ అధిష్టానం సహకరించకపోవడం ఏంటని జనసేన నేతలు నిలదీస్తున్నారు. ఈ పరిణామాలు ఏ ఉపద్రవానికి దారి తీస్తాయో చూడాలి.