జనసేనాని పవన్‌కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు ఆయన ప్రకటించడం విశేషం. జనసేన సోషల్ మీడియా సమావేశంలో పవన్‌కల్యాణ్ ప్రసంగిస్తూ భీమవరం ఆసక్తికర కామెంట్స్ చేశారు.
భీమవరం టికెట్‌ను పులిపర్తి ఆంజనేయులుకు, తిరుపతి సీటును ఆరణి శ్రీనివాసులుకు ఇచ్చామన్నారు. విశాఖ జిల్లా గాజువాక సీటును టీడీపీ తీసుకుందన్నారు. ఇక మిగిలింది పిఠాపురం సీటు అని ఆయన అన్నారు. పిఠాపురం ఉదయ్ చేతిలో వుందన్నారు. ఉదయ్‌ని అడిగి పిఠాపురం సీటు తీసుకుందామన్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటూ అభిమానుల హర్షధ్వానాల మధ్య ప్రకటించడం విశేషం.
పవన్‌కల్యాణ్ పోటీపై ఇప్పటి వరకు రకరకాల ఊహాగానాలు హల్చల్ చేశాయి. ఇటీవల ఐదారు సీట్లపై పవన్‌కల్యాణ్ స్పష్టత ఇచ్చారు. అయినప్పటికీ పవన్ పోటీపై మాత్రం సస్పెన్ష్ కొనసాగుతూ వచ్చింది. భీమవరం నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. భీమవరంలో పోటీ చేసేందుకు చంద్రబాబు, లోకేశ్ వద్ద ఆయన క్లారిటీ కూడా తీసుకున్నారు. ఏమైందో తెలియదు కానీ, టీడీపీ ఇన్‌చార్జ్‌ను తన పార్టీలోకి తీసుకొచ్చి, నేడు టికెట్‌ను ప్రకటించడం విశేషం.
జనసేన సోషల్ మీడియా సమావేశంలో పవన్ తన పోటీపై స్పష్టత ఇవ్వడంతో ఆ పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇకపై పిఠాపురంలో జనసేన శ్రేణులు మోహరించనున్నాయి. రానున్న రోజుల్లో పిఠాపురం నిత్యం వార్తలకెక్కనుంది.