చంద్రబాబుతో పాటే పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసిన వారు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు. టీడీపీలో చూస్తే బాబు కంటే సీనియర్. 1995 ఎపిసోడ్ లో బాబుకు వెన్నుదన్నుగా నిలిచి ఆయన సీఎం కావడానికి సహకరించిన వారు. అలాంటి అశోక్ గజపతిరాజు పొలిటికల్ కెరీర్ ముగిసినట్లేనా అన్నదే ఆయన అభిమానులు అనుచరులతో కలుగుతున్న సందేహం.
టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాలో విజయనగరం సీటుని అశోక్ కుమార్తె అదితి గజపతిరాజుకు కేటాయించింది. అశోక్ కి అది ఇష్టమే సమ్మతమే. అయితే ఆయన రెండవ సీటు కూడా కోరుకుంటున్నారు. తాను విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నారు.
రెండు సీట్లు ఒకే ఫ్యామిలీకి ఇవ్వడం కుదరదు అని ఒక పాలసీని కొత్తగా తెచ్చిన చంద్రబాబు అశోక్ విషయంలో దాన్ని సడలిస్తారా అన్నది కూడా అంతా ఆశగా చూస్తున్న వైనం. పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాలో బాబాయ్ అబ్బాయ్ లకు రెండు సీట్లు టీడీపీ ఇవ్వబోతోంది. బాబాయ్ అచ్చెన్నాయుడుకు టెక్కలి సీటుని కేటాయించారు. ఎంపీగా రామ్మోహన్ ఖాయం.
అదే ఫార్ములాను అశోక్ విషయంలో ఎందుకు అనుసరించకూడదు అన్నది ఆయన అనుచరుల మాట. అశోక్ టీడీపీ మూల స్తంభాలలో ఒకరు అని కూడా చెబుతున్నారు. చంద్రబాబు మనసులో ఏముందో తెలియదు కానీ విజయనగరం ఎంపీ సీటుకు వేరే పేర్లు వినిపిస్తున్నాయని టాక్.
విజయనగరం ఎమ్మెల్యే టికెట్ రాజులకు ఇచ్చారు కాబట్టి ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలని పార్టీ భావిస్తోంది అని అంటున్నారు. అదే కనుక జరిగితే అశోక్ రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకున్నట్లే అని అంటున్నారు. అయితే అది స్వచ్చంద పదవీ విరమణ లేక కంపల్సరీ రిటైర్మెంటా అన్నది టీడీపీ పెద్దలే చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు.